ఎప్పుడు ఎవర్నెలా మోసం చేయాలో కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య: షాద్​నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు: బీఆర్ఎస్ తన పదేండ్ల పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఫైరయ్యారు. తన క్యాంప్ ​ఆఫీస్​లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా వెనుకడగు వేయడం లేదన్నారు. ప్రజల్లో తమకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ కవితకు బీసీలపై ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలపై ఎందుకు ప్రేమ చూపించలేదని ప్రశ్నించారు.

ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకునేందుకు అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే బీఆర్ఎస్ అధ్యక్ష, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఎవర్నెలా మోసం చేయాలో కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. బీసీలపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంది కాబట్టే ధైర్యంగా కులగణన చేపట్టారని చెప్పారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నయ్య, చెంది తిరుపతి రెడ్డి, అగ్గనూర్ బస్వం  పాల్గొన్నారు.