
జైపూర్: రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఝలావర్‌లోని పీప్లోడీ ప్రైమరీ స్కూల్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతిచెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. ఉదయం పిల్లలు తరగతులకు హాజరువుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ స్కూల్ భవనాన్ని 20 ఏండ్ల కిందట నిర్మించారని, పైకప్పును రాతి పలకలతో నిర్మించడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టు చెప్పారు. బాధితులందరూ ఏడో తరగతి విద్యార్థులనేనని, వీరి వయస్సు 12 నుంచి 14 ఏండ్ల మధ్య ఉంటుందని వెల్లడించారు.
భారీ రెస్క్యూ ఆపరేషన్
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించి, చిన్నారులను బయటకు తీశారు. గాయపడిన స్టూడెంట్లను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారని ఎస్పీ అమిత్ కుమార్ మీడియాకు తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
పాఠశాల పైకప్పు కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మ, విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ విచారం వ్యక్తం చేశారు.