గిరిజన రైతులను వెంటనే రిలీజ్​చేయాలి : సేవాలాల్ సేన

ముషీరాబాద్, వెలుగు: గిరిజన రైతు ప్రాణం పోతున్న సంకెళ్లు వేసుకొని తీసుకెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ నాయక్ అన్నారు. హీర్యా నాయక్ కు ఏదైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

రైతుకు సంకెళ్లు వేయటంపై పోలీసుల, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా.. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సేవాలాల్ సేన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంజీవ్ నాయక్ మాట్లాడుతూ.. లగచర్ల ఘటనలో అరెస్టయిన గిరిజన రైతులను భేషరతుగా విడుదల చేసి, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అసెంబ్లీని ముట్టడించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో కల్యాణ్ నాయక్, రాజు నాయక్, హరి నాయక్, అశోక్ నాయక్, దేవేందర్ నాయక్, నందు లాల్, ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

గుడిమల్కాపూర్​లో దిష్టిబొమ్మ దహనం

మెహిదీపట్నం: లగచర్ల రైతుకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ గోల్కొండ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా కార్వాన్ కన్వీనర్ గోదా లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్ డివిజన్ మహాత్మా జ్యోతి బాఫూలే విగ్రహం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. 

కిసాన్ మోర్చా తెలంగాణ ఉపాధ్యక్షుడు దేవర శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ఖమ్మంలో మిర్చి రైతుకు, ఇప్పుడు రేవంత్ పాలనలో లగచర్ల రైతుకు బేడీలు వేశారని మండిపడ్డారు. కాంగ్రెస్​ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్నారు. కార్యక్రమంలో ముఖేష్ సాగర్, సుధాకర్ యాదవ్, శ్రీకాంత్ సాగర్, ప్రభు పూజారి, వెంకటేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.