కొత్త ఐఫోన్ లాంచ్ అయిందంటే చాలు. దాని కోసం ఒకడు బండి అమ్మేసుకున్నాడు, మరొకడు ఇల్లు కుదవపెట్టాడు, ఇంకొకడు కిడ్నీ అమ్మి ఫోన్ కొనుక్కున్నాడని సోషల్ మీడియాలో వార్తలు, జోకులు వచ్చేస్తుంటాయి. అయితే అవి ఐఫోన్‌లకే పరిమితం కాదండోయ్. ఈ కేటగిరీలోకి హెడ్ ఫోన్స్ కూడా వచ్చేశాయి. ఈమధ్య అమెజాన్‌లో కొత్త రకం హెడ్ ఫోన్స్‌ను అమ్మకానికి పెట్టారు. షెన్‌హెయిసర్ కంపెనీవి. ధర లక్షా 89 వేల 990 రూపాయలు. వీటితో మంచి సౌండ్ క్వాలిటీ ఎక్స్‌పీరియెన్స్ పొందొచ్చంట. రెండేళ్ల వారంటీ కూడా ఉంది. ఇంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది.
ఓ అమెజాన్ రివ్యూయర్ ఆ హెడ్ ఫోన్స్‌కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. నోటికొచ్చింది రాసేశాడు. ‘నేను, నా ఫ్రెండ్స్ ఈ ప్రొడక్ట్ కొనడానికి కిడ్నీలను అమ్మేసుకున్నాం. అంత వాల్యూ వీటికుంది. పాటలు రిలీజ్ కాకముందే వీటిలో వినొచ్చు. ఆడియో ఫైల్స్ ఆటోమెటిక్‌గా ఎడిట్ అవుతాయి. ఆల్‌మైటీ ఎఫ్‌ఎంకు ట్యూన్ అయి దేవుడి నుంచి సలహాలు కూడా తీసుకుంటున్నా. చివరగా.. అమెజాన్ ప్రైమ్ లేకుండానే వీటిని ఫ్రీగా డెలివరీ చేశారు’ అని రాశాడు. రత్న వర్శిత్ అనే వ్యక్తి ఈ హెడ్ ఫోన్స్ కోసం ఇంటిని అమ్మేసుకున్నానని కామెంట్ చేశాడు. ఈ రివ్యూలకు జనం నవ్వుకుంటున్నారనుకోండి.
