దేశం ఎటు పోతోంది..? వివాదాలు ఎంతకాలం ? ఎప్పటిదాకా ఇలా ?

మనుషుల్లో మతం ఇప్పుడు ఒక రాజకీయ చిచ్చుగా మారింది. మానవ సేవే మాధవ సేవ,  మనుషులంతా ఒక్కటే అనుకుంటూ  కలిసి మెలిసి, కులమతాలకు అతీతంగా జీవిస్తున్న భారతదేశంలో ప్రస్తుతం ఏం జరుగుతున్నది?  రామమందిరం, బాబ్రీ మసీదు వివాదం అనంతరం.. రామమందిరం నిర్మాణం, ప్రతిష్టాపన తరువాత ఇక ఇలాంటి వివాదాలు ఉండవు అన్నారు. కానీ, సంభల్​లో ఇటీవల ఘర్షణలు, మరణాలు కూడా సంభవించాయి.

సుప్రీంకోర్టు  న్యాయవాది దుష్యంత్ దవే  ఇటీవల ది వైర్​లో దేశ పరిస్థితిపై కంటతడి పెట్టారు. నిజానికి 1947 ఆగస్టు 15కు ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారం ప్రార్థన  ప్రదేశాలు ఉండాలి. కొనసాగాలి. అయోధ్య, బాబ్రీ వివాదం మాత్రమే  మినహాయింపుగా 1991 చట్టం చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్​ ఇటీవల మాట్లాడుతూ ప్రతి మసీదు కింద శివలింగంను వెతకడం బంద్ చేయాలన్నారు. అయినా, ఈ వివాదాలు ఆగడం లేదు. 1991 చట్టంకు విరుద్ధంగా కోర్టులు  సర్వేల ఆదేశాలు ఇస్తూనే ఉన్నాయి.  దేవుని పేరుమీద తరచూ రాజకీయాలు చేసే వారికి ఇదో అవకాశం అవుతున్నది.  మాజీ సీజేఐ చంద్రచూడ్​ 2002లో  ప్రార్థన స్థలాల ప్రాచీన స్వరూపం ఏమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి.

ఆరని మణిపూర్ మంటలు
ఏడాది దాటినా మణిపూర్​లో అల్లర్ల మంటలు చల్లారడం లేదు.  మందిర్,  మసీదు, చర్చి అంటూ, హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయిలు అంటూ మనుషుల మధ్యన చిచ్చు పెడుతున్న వారిని అనుసరించడం ఏమాత్రం సరికాదు.---మానవ హక్కుల కోసం అందరం ఒక్కటి అవుదాం.------ రాజ్యాంగం ప్రకారం పౌరులకు సంక్రమించే హక్కులను హరిస్తున్న వారిని మనుషులంతా ఒక్కటై ప్రశ్నించాల్సిన సమయం ఇది. ఇక్కడి మనుషులందరిది  మనిషి కులం.  మనిషి మతం. ఆ తర్వాతే అన్నీ!  మానవ హక్కుల పరిరక్షణ కోసం కుల, మతాలకు అతీతంగా కలిసి ఉందాం! కలిసి పోరాడుదాం!

ఎప్పటిదాకా ఇలా ?
రానున్న రోజుల్లో ప్రతి దర్గా, మసీదు కింద మందిరం ఉన్నదనే వాదన కొనసాగే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉన్నది. తాజాగా 800 ఏండ్ల చరిత్ర గల అజ్మిర్  ను టార్గెట్ చేశారు.  అప్పటి హిందూ రాజా 42,961తులాల వెండితో అక్కడ స్ట్రక్చర్​ ఏర్పాటు చేశారు.   హిందూ, ముస్లింలు అందరూ వెళ్లే  అజ్మిర్ దర్గా కింద మందిరం ఉందని హిందూసేన రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు గుప్త  కోర్టులో పిటిషన్ వేయడం, దానిని  కోర్టు 1991 చట్టంకు విరుద్ధంగా స్వీకరించడం జరిగింది. మరోసారి సుప్రీంకోర్టు  జోక్యం  చేసుకుని 2019లో మాదిరి 1991 ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టాన్ని మరోసారి సమర్థించాలి.  దేశంలో  ఎవరో ఒకరు ఇలా పిటిషన్స్ వేస్తూ వెళుతుంటే పరిస్థితి ఎక్కడకు దారి తీస్తుంది? వాటిని కొందరు జడ్జిలు సమర్థిస్తూ సర్వేలు అంటూ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం.

ఎండి.మునీర్, సీనియర్ జర్నలిస్ట్