సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు

  • కొడుకు గిఫ్ట్​ డీడ్​ రద్దు చేసి తండ్రికి భూమి అప్పగింత ​ 

రేగోడ్, వెలుగు : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో  నిర్లక్ష్యం వ్యవహరిస్తే తల్లిదండ్రులకు ఆస్తిని తిరిగి అప్పగిస్తామని రేగోడు తహసీల్దార్ నరేశ్ తెలిపారు. రోగోడ్​ గ్రామానికి చెందిన ఏన్కతల సంగారెడ్డి (77) కొడుకులు తన బాగోగులు చూడడం లేదని, పోషణకై కనీసం నెలకు రూ.5 వేలు ఇవ్వమని కోరినా ఒప్పుకోవడం లేదని,  తన భూమిని తనకు తిరిగి అప్పగించాలని మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్  యాక్ట్​ 2007 ప్రకారం కలెక్టర్  కు ఫిర్యాదు చేశారు.

విచారణ అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు కొడుకు మహిపాల్​ రెడ్డి పేరు మీద ఉన్న గిఫ్ట్​ డీడ్​ రద్దు చేసి 240 సర్వే నెంబర్​లో ఉన్న 1.03 ఎకరాల భూమిని తండ్రి ఏన్కతల సంగారెడ్డి పేరు మీద పట్టాచేసి అందుకు సంబంధించిన పట్టా సర్టిఫికెట్, పాస్​బుక్​ను తహసీల్దార్​ నరేశ్​ మంగళవారం సంగారెడ్డికి అందజేశారు. తనకు న్యాయం చేసినందుకు కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగానికి సంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.