ఎల్లుండి బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: కొత్త అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ ఆర్. వెంకటరమణి (72) నియమితులయ్యారు. ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ నెల 30న రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో వెంకటరమణి అక్టోబర్ 1న బాధ్యతలు చేపడ్తారు. వెంకటరమణి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారని పేర్కొంటూ బుధవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఆఫీసు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంకటరమణి పుదుచ్చేరిలో 1950, ఏప్రిల్ 13న జన్మించారు. తమిళనాడు బార్ కౌన్సిల్ లో 1977లో లాయర్‌గా రిజిస్టర్ అయ్యారు. ఆయన 1979లో సుప్రీంకోర్టు లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2010 నుంచి 2013 వరకు ఆయన లా కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కూడా పని చేశారు.
