అదేపనిగా చూస్తే అనర్థమే

అదేపనిగా చూస్తే అనర్థమే
  • యూనివర్శిటీ ఆఫ్‌ గ్లాస్గో పరిశోధన

తీరిక సమయంలో చాలామంది చేసే పని టీవీ చూడటం. రిలాక్స్‌ అవడానికి అయితే ఫర్వాలేదు కానీ అదే పనిగా టీవీకి అతుక్కుపోతే మాత్రం చావుకు దగ్గరవ్వడమేనని చెబుతున్నారు పరిశోధకులు. టీవీ స్క్రీన్ ను అదేపనిగా చూడటం వల్ల గుండె సంబంధ వ్యాధులు,క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు. స్కాట్ లాండ్ కు చెందిన యూనివర్శిటీ ఆఫ్‌ గ్లాస్గో జరిపిన ఒక పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గ్లాస్గో విశ్వవిద్యాలయం దాదాపు నాలుగు లక్షల మందితో అతిపెద్ద సర్వే నిర్వహించింది. శారీరకంగా దృఢంగా లేని వాళ్లు, కండరాలలో సత్తువలేని వాళ్లు మరింత ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఈ సర్వే ద్వారా తెలిసింది. ఎక్కువ సేపు టీవీ చూస్తుండటం వల్ల గుండె సంబంధ వ్యాధులు,పేగు క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఒబెసిటీ లాంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది.ఇంకో విషయం ఏంటంటే.. ఇది కేవలం టీవీ మాత్రమే కాకుండా కంప్యూటర్‌కు కూడా వర్తిస్తుంది. అయితే,ఈ ప్రభావం అందరిపై ఒకేలా ఉండదని తెలిపారు. టీవీ, కంప్యూటర్‌ని చూస్తున్నపుడు ఎంత టైం గ్యాపు తీసుకుంటున్నారు. శారీరకంగా వాళ్లు ఎంత బలంగా ఉన్నారు..ఆరోగ్యపు అలవాట్లు,శారీరక శ్రమ ఇలా అన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుందని పరిశోధనలో తెలిసింది.