నకిలీ మెసేజ్‌‌లతో జర భద్రం

నకిలీ మెసేజ్‌‌లతో జర భద్రం

ముంబై: స్కామ్ మెసేజ్‌‌లు, ఈ–మెయిల్స్‌‌తో జర భద్రంగా ఉండాలంటూ పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ తమ యూజర్లకు సూచించారు. కంపెనీ అధికారులమని చెప్పుకొని మోసగాళ్లు స్కామ్ మెసేజ్‌‌లు, ఈ–మెయిల్స్‌‌ను యూజర్లకు పంపిస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ‘ప్లీజ్, మీ పేటీఎం అకౌంట్ బ్లాక్‌‌ అయిందంటూ వచ్చే ఎస్‌‌ఎంఎస్‌‌లను నమ్మకండి. కేవైసీ చేయండంటూ వచ్చేవి కూడా మోసగాళ్లు పంపేవే’ అని విజయ్ శేఖర్ శర్మ ట్వీట్ చేశారు. కొంతమంది పేటీఎం కస్టమర్లకు మోసగాళ్లు పంపే ఎస్‌‌ఎంఎస్‌‌ పిక్చర్లను శర్మ ట్విట్టర్‌‌‌‌లో షేర్‌‌‌‌ చేశారు. ఆ ఎస్‌‌ఎంఎస్‌‌ల్లో ‘మీ పేటీఎం అకౌంట్‌‌ను కొద్ది సేపు నిలిపివేస్తున్నాం. పేటీఎం కేవైసీని పూర్తి చేయండి, అలాగే ఫోన్ నెంబర్ ఇవ్వండి’ అని ఉంది. కొంతమంది మోసగాళ్లు మీరు లక్కీ డ్రా పొందారని, మీ వివరాలు ఇవ్వాలని యూజర్లను అడుగుతున్నారని, వారి గుప్పిట్లో పడొద్దు’ అని కస్టమర్లకు శర్మ హెచ్చరించారు.

విపరీతంగా కంప్లెయింట్స్‌‌

గత మూడు నెలలుగా పేటీఎం కస్టమర్లు కంపెనీ సైబర్ సెల్ వద్ద భారీగా కంప్లయింట్స్‌‌ను దాఖలు చేస్తున్నారు. మోసాలు జరుగుతున్నాయని, పేటీఎం ఉద్యోగులుగా మోసగాళ్లు తమల్ని మోసం చేస్తున్నారని కస్టమర్లు ఆర్‌‌‌‌బీఐ అంబుడ్స్‌‌మెన్‌‌ వద్ద కంప్లయింట్స్ రిజిస్టర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మ కస్టమర్లకు ఈ సూచనలు చేశారు. మోసగాళ్లు టార్గెట్ చేసిన కస్టమర్లను కేవైసీ ప్రాసెస్‌‌ను పూర్తి చేయడానికి ఓ మొబైల్ లేదా డెస్క్‌‌టాప్ యాప్‌‌ను డౌన్‌‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ యాప్స్‌‌లో ఎనీడెస్క్,క్విక్‌‌సపోర్ట్, టీవ్యూయర్ వంటివి ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా మోసగాళ్లు కస్టమర్ల బ్యాంక్‌‌ అకౌంట్‌‌తో లింక్ అయి ఉన్న మొబైల్ వాలెట్ల ద్వారా ఫండ్స్‌‌ను తమ అకౌంట్లకు ట్రాన్స్‌‌ఫర్ చేసుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు క్రైమ్ బ్రాంచ్‌‌కు లేదా తమకు తెలియజేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. తమ సైబర్ సెల్ డిపార్ట్‌‌మెంట్, పోలీసు క్రైమ్ బ్రాంచ్‌‌లతో ఎప్పటికప్పుడు టచ్‌‌లోనే ఉంటుందని, ఈ సంఘటనలపై కస్టమర్లకు బ్లాక్ పోస్ట్‌‌లు,యాప్ నోటిఫికేషన్లు, సోషల్ మీడియాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని గుప్తా చెప్పారు.

మరిన్ని వార్తల కోసం