సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ RF నారీమన్ ఇవాళ(గురువారం) పదవీ విరమణ చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి ఆయనే. తన పదవీ కాలంలో జస్టిస్ నారీమన్ ఎన్నో చారిత్రక తీర్పులనివ్వడంలో భాగస్వామి అయ్యారు. తన పదవీకాలం చివరిరోజైన గురువారం సీజేఐ ఎన్వీ రమణతో కలిసి కోర్టు హాల్ నంబర్-1లో కూర్చున్నారు. రిటైర్ అవుతున్న జడ్జిలు తమ చివరి రోజున ఈ హాల్లో కూర్చోవడం ఆనవాయతీగా వస్తోంది.
న్యాయ వ్యవస్థ ఒక ఉన్నతమైన వ్యక్తిని, ఒక మేథావిని మిస్ అవుతుందని చెప్పారు సీజేఐ ఎన్వీ రమణ. తన కెరీర్లో మొత్తం 13,565 కేసులను నారీమన్ డీల్ చేశారని చెప్పారు.
జస్టిస్ నారీమన్ హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారు. 35 ఏళ్ల పాటు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. ప్రముఖ లాయర్ ఫాలీ నారీమన్ కుమారుడే జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్. 37 ఏళ్ల వయసులోనే ఆయనను సీనియర్ లాయర్ గా సుప్రీంకోర్టు గుర్తించింది. 2011లో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. భారత చరిత్రలో నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన ఘనత కేవలం నారీమన్ కు మాత్రమే దక్కింది.
