- ప్రతిపాదించిన సెబీ
- ప్రత్యేక హాట్‌లైన్ కూడా ఏర్పాటు
స్టాక్ మార్కెట్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసేవారి సమాచారాన్ని వెల్లడిస్తే రూ.కోటి నజరానా ఇస్తామని సెబీ ప్రకటించింది. ఇలాంటి వివరాలు తెలియజేయడానికి, చిన్నచిన్న తప్పులను పరిష్కరించడానికి ప్రత్యేక హాట్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ మేరకు సెబీ ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ (పీఐటీ) రూల్స్‌లో మార్పులు చేసింది. వీటి అమలుకు త్వరలో సెబీ బోర్డు అనుమతి కోరనుంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ గురించి అధికారులు సమాచారం ఇస్తే వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండవు. ఎందుకంటే ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను కనిపెట్టడం అధికారుల విధి కాబట్టి వారికి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేమని సెబీ తెలిపింది. వ్యక్తులు, కార్పొరేట్లు, ఆడిటర్లు సమాచారం అందిస్తే మాత్రం నజరానా పొందే అవకాశాలు ఉంటాయని వివరణ ఇచ్చింది. కంపెనీలో పరిణామాలను రహస్యంగా తెలుసుకుని తదనుగుణంగా ట్రేడింగ్ చేయడాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌గా పిలుస్తారు. ఈ విధానం వల్ల ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని సెబీ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసేవాళ్లు నేరుగా కాకుండా వేరేవారితో చేయిస్తారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వెనుక ఉన్నవారిని గుర్తించడం సెబీ వంటి సంస్థలకు సవాలుగా మారుతోంది. అందుకే సమాచారం ఇచ్చే వారికి నజరానా అందించే ప్రతిపాదనను తీసుకొచ్చింది.
అప్పుల వివరాలు రేటింగ్ ఏజెన్సీలకు చెప్పాలి
అప్పులు బకాయిపడ్డ కంపెనీల, వ్యక్తుల వివరాలు ఇవ్వడానికి బ్యాంకులు తిరస్కరిస్తుండటంతో ఇలాంటి వాటిని గుర్తించడానికి సెబీ కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. బకాయిల గురించి కంపెనీలు తప్పనిసరిగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు తెలియజేయాలని ప్రతిపాదించింది. కార్పొరేట్లు పెద్ద ఎత్తున బ్యాంకులకు బకాయిపడటం, ఐఎల్‌ఎఫ్‌ఎస్ వంటి ఎన్‌బీఎఫ్‌సీలు దివాలా తీయడం, సెక్యూరిటీల రిస్కులను అంచనా వేయడంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బకాయిల గురించి కంపెనీలు, బ్యాంకులు సమాచారం ఇవ్వడం లేదు కాబట్టి తాము హెచ్చరించలేకపోతున్నామని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు వాదిస్తున్నాయి. బ్యాంకులు ఆర్‌బీఐ నియంత్రణలో ఉండగా, కంపెనీలు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు సెబీ నియంత్రణలో ఉండటంతో సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అందుకే ఇక నుంచి లిస్టెడ్ అయినా, అన్‌లిస్టెడ్ కంపెనీలు అయినా.. రేటింగ్ పొందడానికి బకాయిల వివరాలను తప్పనిసరిగా తెలియజేసేలా రూల్స్‌ను మార్చాలని సెబీ కోరుకుంటున్నది. ఈ మేరకు త్వరలోనే బోర్డు అనుమతి కోరనుంది. ఈ రూల్ అమలైతే కంపెనీల ఆర్థిక పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులోకి వస్తుంది. అంతేగాక కంపెనీ సెక్యూరిటీలను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తాయి.
