న్యూఢిల్లీ అదాని గ్రూప్ కంపెనీలపై సెబీ, డీఆర్ఐ దర్యాప్తు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్‌గా వెల్లడించింది. రూల్స్ పాటించనందుకుగాను ఈ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో ఈ వివరాలు వెల్లడించారు. అదాని గ్రూప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన మారిషస్ కంపెనీల ఖాతాలను 2016లో ఫ్రీజ్ చేసిన మాట నిజమేనని, కొన్ని లిస్టెడ్ కంపెనీల జీడీఆర్ ఇష్యూల విషయంలో ఈ ఫ్రీజ్ జరిగిందని మంత్రి చెప్పారు. ఇతర కంపెనీల విషయంలో ఈ ఫ్రీజ్ లేదని పేర్కొన్నారు. రెగ్యులేషన్స్ పాటించారా లేదా అనే విషయంలో అదాని గ్రూప్ కంపెనీలపై సెబీ దర్యాప్తు జరుపుతోందని చెప్పారు. ఇంతకు మించిన వివరాలను ఆయన ఇవ్వలేదు. అదాని గ్రూప్‌కే చెందిన కొన్ని కంపెనీలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కూడా దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే, అదాని గ్రూప్‌లోని ఏ కంపెనీలపై ఈ దర్యాప్తు జరుగుతున్నదీ మాత్రం మంత్రి చెప్పలేదు. ఆరు మారిషస్ ఫండ్స్ అకౌంట్లను ఎన్ఎస్డీఎల్ ఫ్రీజ్ చేసిందనే రిపోర్టులతో కిందటి నెలలో అదాని గ్రూప్‌లోని చాలా కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ఫండ్స్ తమ మొత్తం పెట్టుబడులలో 90 శాతాన్ని అదాని గ్రూప్ కంపెనీలలోనే పెట్టాయి. మూడు ఫండ్స్ ఈ గ్రూప్‌లో ఏకంగా 6 బిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులను పెట్టినట్లు సమాచారం. మారిషస్ ఫండ్స్ అకౌంట్ల ఫ్రీజ్ మాట అబద్దమని జూన్ 14న అదాని గ్రూప్ ప్రకటించింది. అయితే, ఆ తర్వాత రోజు మాత్రం మూడు ఫండ్స్ డీమాట్ అకౌంట్లను సస్పెండ్ చేశారని చెప్పింది. దీంతో కన్ఫ్యూజన్ మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో అదాని గ్రూపు కంపెనీల షేర్లు భారీగా పడ్డాయి. ఇది జరగడానికి ముందు 2020 నుంచి అదాని గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల షేర్లు ఆరు రెట్లు దాకా పెరిగాయి. దీంతో సంపద విషయంలో ముకేశ్ అంబానికి చాలా దగ్గరగా వచ్చారు గౌతమ్ అదాని. మూడు మారిషస్ కంపెనీల బెనిఫిషియరీ అకౌంట్ల ఫ్రీజ్‌పై ఎలాంటి ఆర్డర్లనూ సెబీ జారీ చేయలేదని మంత్రి చౌదరి లోక్‌సభలో స్పష్టం చేశారు.
రూల్స్ పాటిస్తున్నాం....అదాని గ్రూప్
సెబీ రెగ్యులేషన్స్ అన్నింటినీ తాము పాటిస్తున్నామని అదానీ వివరణ ఇచ్చింది. సెబీ ఇటీవల తమను ఏమీ అడగలేదని పేర్కొంది. ఐదేళ్ల కిందట అదాని పవర్‌కు డీఆర్ఐ నోటీసు వచ్చిందని, ఎక్విప్మెంట్ ఓవర్ వాల్యుయేషన్ జరగలేదని డీఆర్ఐ భావించిందని, ఈ అంశం ఇప్పుడు అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఉందని తెలిపింది.
ఫస్ట్ క్వార్టర్లో 36,191 కొత్త కంపెనీలు
దేశంలో ఏప్రిల్–జూన్ మధ్యలో కొత్తగా 36,191 కంపెనీలు ఏర్పాటయినట్లు అఫీషియల్ డేటా చెబుతోంది. దీంతో జూన్ నెలాఖరు నాటికి యాక్టివ్‌గా ఉన్న మొత్తం కంపెనీల సంఖ్య 13.76 లక్షలకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కొత్త కంపెనీల ఏర్పాటు ఎక్కువైందని లోక్‌సభలో కార్పొరేట్ ఎఫెయిర్స్ మినిస్టర్ ఇందర్జిత్ సింగ్ వెల్లడించారు. అంతకు ముందు ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 18,968 కంపెనీలు ఏర్పాటయ్యాయని చెప్పారు. దేశంలోని కంపెనీలపై కరోనా వైరస్ ప్రభావం ఏ మేరకు ఉందనే ఒక ప్రశ్నకు బదులు చెబుతూ ఈ వివరాలను ఆయన వెల్లడించారు. ఏజీఎంలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పెట్టుకోవడంతో సహా పలు రకాల సపోర్టును కంపెనీలకు అందించినట్లు మినిస్టర్ తెలిపారు. జూన్ చివరిదాకా దేశంలో మొత్తం 21.87 లక్షల కంపెనీలు రిజిస్టరయ్యాయని, ఇందులో 13.76 లక్షల కంపెనీలు యాక్టివ్‌గా ఉండగా, వివిధ కారణాల వల్ల 8.10 లక్షల కంపెనీలు యాక్టివ్‌గా లేవన్నారు.
ఎకానమీ రికవరవుతోంది
మన ఎకానమీ రికవరీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పంకజ్ చౌదరి లోక్‌సభకు చెప్పారు. ప్యాకేజీలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంపుదల, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ల కారణంగానే ఎకానమీ పుంజుకుంటోందని పేర్కొన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్యూ3లో జీడీపీ 0.5 శాతం, క్యూ4లో 1.6 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఎకానమీ రికవరీపై సెకండ్ వేవ్ కొంత ప్రభావం చూపెట్టిందని ఆయన అన్నారు.
