ZIM vs AFG: జింబాబ్వే క్రికెటర్ క్రీడాస్ఫూర్తి.. అంపైర్ నాటౌట్ ఇచ్చినా వెళ్ళిపోయాడు

అంపైర్ ఔట్ ఇస్తేనే ఆ నిర్ణయాన్ని క్రికెటర్లు ఛాలెంజ్ చేస్తారు. ఔట్ అని తెలిసినా థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న రెండో టెస్టులో జింబాబ్వే స్టార్ బ్యాటర్ సీన్ విలియమ్స్ తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. అంపైర్ తనను నాటౌట్ గా ప్రకటించినా నిజాయితీగా తాను ఔట్ అని ఒప్పుకొని పెవిలియన్ కు చేరాడు. దీంతో ఇప్పుడు విలియమ్స్ క్రీడా స్ఫూర్తిపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో రషీద్ ఖాన్ బౌలింగ్ ఆడడంలో విలియమ్స్ విఫలమయ్యాడు. బంతిని డ్రైవ్ చేయబోతే అది మిస్సయ్యి వికెట్ కీపర్ చేతిలో పడింది. బ్యాట్ కు ఎడ్జ్ అయిందని వికెట్ కీపర్ తో పాటు రషీద్ ఖాన్ అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ మాత్రం నాటౌట్ అని చెప్పాడు. ఈ దశలో విలియమ్స్ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. బంతి బ్యాట్ కు తగిలిందని గ్రౌండ్ వదిలిపోయాడు. నిజానికి ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కు ఎలాంటి రివ్యూస్ లేకపోవడం విశేషం. 

Also Read : ఔటయ్యాక సిడ్నీలో కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్

విలియమ్స్ పెవిలియన్ కు వెళ్లకుండా క్రీజ్ లోనే ఉంటే బ్యాటింగ్ కొనసాగించేవాడు. 49 పరుగుల వద్ద ఉన్నప్పటికీ ఈ జింబాబ్వే బ్యాటర్ మైదానం వదిలి వెళ్లేందుకు సిద్ధపడ్డాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 157 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో జింబాబ్వే 243 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి 123 పరుగుల ఆధిక్యంలో ఉంది.