సుప్రీం తీర్పుతో టెలికామ్​ కంపెనీలకు మరో దెబ్బ

సుప్రీం తీర్పుతో టెలికామ్​ కంపెనీలకు మరో దెబ్బ
  • సర్కారుకు పైసలు కట్టక తప్పని పరిస్థితి
  • ఏజీఆర్‌‌‌‌ విషయంలో డీఓటీకి అనుకూలంగా తీర్పు
  • రూ.92 వేల కోట్ల రికవరీకి అనుమతి
  • కుదేలైన టెలికాం స్టాక్స్

న్యూఢిల్లీ: అసలకే రిలయన్స్ జియో దెబ్బకు కోలుకోలేని నష్టాల బారిన పడి కుయ్యోమొర్రో అంటోన్న టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. అడ్జెస్టడ్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) విషయంలో టెలికాం ఆపరేటర్లకు, ప్రభుత్వానికి గత 14 ఏళ్లుగా సాగుతోన్న న్యాయ వివాదానికి ఫుల్‌‌స్టాప్ పెడుతూ.. డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌‌కు(డీఓటీకి) అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పటికే రెవెన్యూలు లేక, తీవ్ర రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న టెలికాం కంపెనీలకు సుప్రీం తీర్పు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి రూ.92,642 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో సగానికి పైగా భారతీ ఎయిర్‌‌‌‌టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కంపెనీలే చెల్లించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో స్టాక్ మార్కెట్‌‌లో టెలికాం స్టాక్స్ తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి.

అసలు వివాదమేమిటి…?

ఏజీఆర్‌‌ డెఫినిషన్‌‌  విషయంలో ప్రభుత్వానికి, టెలికాం కంపెనీలకు ఎప్పటి నుంచో వివాదం ఉంది. ఏజీఆర్‌‌‌‌ను రెండు భాగాలుగా విభజించారు. ఒకటి స్పెక్ట్రమ్ వాడకపు ఛార్జీలు, రెండు లైసెన్సింగ్ ఫీజులు. స్పెక్ట్రమ్ వాడకపు ఛార్జీల కింద ఏజీఆర్‌‌‌‌గా 3–5 శాతం, లైసెన్స్ ఫీజుల ఏజీఆర్‌‌‌‌గా8 శాతం టెలికాం కంపెనీలు చెల్లించాలి. డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డీఓటీ) ప్రకారం ఈ ఛార్జీలను టెల్కోలు ఆర్జించే అన్ని రెవెన్యూలను ఆధారంగా చేసుకుని లెక్కించాలి. అంటే నాన్ టెలికాం రిలేటెడ్ రెవెన్యూలు.. డిపాజిట్ వడ్డీలు, ఆస్తులు అమ్మకం వంటివి కూడా దీనిలో ఉండాలని డీఓటీ వాదన. టెల్కోలు మాత్రం ఏజీఆర్‌‌‌‌ అనేది కేవలం టెలికాం సర్వీసుల నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూల ఆధారంగా మాత్రమే ఉండాలని అంటున్నాయి. ఈ విషయంలోనే ప్రభుత్వానికి, టెల్కోలకు 2005 నుంచి వివాదం నడుస్తూ వస్తోంది.

ఏజీఆర్ లెక్కగట్టే పద్ధతి విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సవాల్ చేసింది. ఈ కేసులో టెలికాం ట్రిబ్యునల్స్ పలు జడ్జిమెంట్లను కూడా గతంలో ఇచ్చాయి. మళ్లీ మళ్లీ అప్పీల్‌‌కు ఈ కేసు వెళ్తూనే ఉంది. చిట్టచివరికి 2019 ఆగస్ట్ 1న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. గురువారం దీనిపై తుది తీర్పు వెల్లడైంది. జడ్జిస్ అరుణ్ మిశ్రా, ఏఏ నజీర్, ఎంఆర్‌‌‌‌ షా నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పునిచ్చింది. టెలికాం సర్వీసు ప్రొవైడర్ల నుంచి ప్రభుత్వం రూ.92 వేల కోట్ల ఏజీఆర్‌‌‌‌ రికవరీ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. డీఓటీ అప్పీల్‌‌ను తాము అనుమతించి, టెల్కోల అప్పీల్‌‌ను కొట్టివేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఏదో ఒకటి, రెండు  రెవెన్యూ కాంపోనెంట్స్ మినహా మిగతా అన్ని కూడా డీఓటీ ఏజీఆర్‌‌‌‌ డెఫినిషన్‌‌కు అనుగుణంగానే ఉన్నాయని చెప్పింది.

టెలికాం కంపెనీలు సమర్పించిన ఇతర సబ్‌‌మిషన్లన్నింటినీ కొట్టివేస్తున్నట్టు తెలిపింది. సర్వీసు ప్రొవైడర్లు పెనాల్టీలను, వడ్డీలను అన్నింటినీ డీఓటీకి కట్టాలనిఆదేశించింది. ఈ విషయంలో తదుపరి లిటిగేషన్ ఏమీ ఉండదని, టెల్కోల పేమెంట్ బకాయిలు లెక్కించడానికి ఒక టైమ్ ఫ్రేమ్‌‌ను నిర్ణయించనున్నామని బెంచ్ స్పష్టం చేసింది. అయితే  ఈ ఏజీఆర్‌‌‌‌ బకాయిలు చెల్లించడానికి టెల్కోలు కనీసం ఆరు నెలల సమయం అడిగాయి. వారి అభ్యర్థనను బెంచ్ పరిగణలోకి తీసుకుంటుందని చెప్పింది.

వొడాఫోన్ ఐడియా 27 శాతం క్రాష్…

ఈ తీర్పు నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేర్లు ఇంట్రాడేలో 27 శాతం వరకు క్రాషయ్యాయి. దీంతో కంపెనీ షేరు విలువ బీఎస్‌‌ఈలో 52 వారాల కనిష్టంలో రూ.4.10కు పడిపోయింది. చివరికి 23.36 శాతం నష్టంతో రూ.4.33 వద్ద వొడాఫోన్ ఐడియా షేరు క్లోజైంది. షేరు ధర ఇలా పడిపోవడంతో కంపెనీ ఇన్వెస్టర్ల సంపద రూ.3,792.58 కోట్ల మేర ఆవిరైంది. ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,442.42 కోట్లుగా ఉంది. ఇటీవల రైట్స్ ఇష్యూకు వెళ్లినప్పుడు కంపెనీ షేరు విలువ రూ.16.80గా ఉండేది. వొడాఫోన్ ఐడియాతో పాటు భారతీ ఎయిర్‌‌‌‌టెల్ కూడా 10 శాతం మేర తగ్గింది.  చివరికి కొంత కోలుకుని 2.96 శాతం లాభంతో రూ.371 వద్ద క్లోజైంది.

డిజిటల్ ఇండియాకు ఎదురుదెబ్బ…

ఈ నిర్ణయం ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న టెలికాం రంగంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుందని ఈవై ఎమర్జింగ్ మార్కెట్స్ టీఎంటీ లీడర్ ప్రశాంత్ సింఘల్ చెప్పారు. బ్రాడ్‌‌బ్యాండ్ కోసం ఫండ్స్‌‌ను సేకరించుకోవడానికి, నెట్‌‌ వర్క్ విస్తరణకు ఇక కష్టమవుతుందని, డిజిటల్ ఇండియాకు కూడా ఇది ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. దీని ప్రభావం కేవలం టెలికాం ఆపరేటర్లకు మాత్రమే పరిమితం కాదని, డిజిటల్ వాల్యు చెయిన్‌‌పై దీని ఎఫెక్ట్ ఉంటుందన్నారు. టెలికాం రంగం ఇప్పటికే రూ.7 లక్షల కోట్లకు పైగా రుణాల్లో కూరుకుపోయింది.

బీఎస్‌‌ఎన్‌‌ఎల్, ఎంటీఎన్‌‌ఎల్‌‌కు ఫండ్‌‌గా…

వొడాఫోన్ ఐడియా వద్ద జూన్ ముగిసే నాటికి రూ.21వేల కోట్ల క్యాష్ బ్యాలెన్స్ ఉంది. సుప్రీం నిర్ణయంతో ఈ నగదంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఆశ్చర్యకరంగా ఈ తీర్పుకు ఒక్క రోజు ముందే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్‌‌ఎన్‌‌ఎల్ లిమిటెడ్, ఎంటీఎన్‌‌ఎల్ లిమిటెడ్ రివైవల్ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ భారీ జరిమానాలు.. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్‌‌ఎల్ రివైవల్ ప్లాన్‌‌కు ఫండ్‌‌గా ఉపయోగపడతాయని కొటక్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ లోని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

ఏజీఆర్‌‌‌‌ విషయంలో సుప్రీం తీర్పు టెలికాం రంగ సామర్థ్యాన్ని మరింత బలహీనపరుస్తుంది. దీని ప్రభావాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా రివ్యూ చేయాలి. ఆర్థిక భారం నుంచి గట్టెక్కించేలా ప్లాన్‌‌ చేయాలి..‌‌- భారతీ ఎయిర్‌‌‌‌టెల్

టెలికాం రెవెన్యూ విషయంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇండస్ట్రీకి డ్యామేజింగ్‌‌గా నిలువనుంది. లీగల్ కన్సల్టేషన్ తర్వాత రివ్యూ అప్లికేషన్‌‌ వేసేందుకు చూస్తాం…..వొడాఫోన్ ఐడియా