- ఇది తీవ్రమైన విషయం: సుప్రీం కోర్టు
- వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు
న్యూఢిల్లీ: ఆధార్‌తో అనుసంధానం చేయలేదని దాదాపు 3 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయడం తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. ఆధార్‌తో రేషన్ కార్డు అనుసంధానం కాలేదని రేషన్ కార్డు రద్దు చేయడంతో జార్ఖండ్‌లోని సిండెగ జిల్లాకు చెందిన కొయిలీ దేవి కూతురు సంతోషి ఆకలికి తట్టుకోలేక మరణించింది. ఈ సంఘటన 2018 సెప్టెంబర్ 28న జరిగింది. ఈ విషయంపై పేద దళిత మహిళ అయిన కోయిలీ దేవి, చిన్నారి సంతోషి చెల్లెలు గుడియా దేవి కోర్టులో పిటిషన్ వేశారు. ఆధార్ రేషన్ అనుసంధానం కాలేదని తమ రేషన్ కార్డు రద్దు చేశారని, దీంతో 2017 నుంచి తమకు రేషన్ అందలేదని, ఆకలితో అల్లాడిపోయామని పిటిషన్‌లో వాళ్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారణ జరిపింది.
లోతుగా విచారించాలి: కోర్టు
కోయిలీ దేవి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కోలిన్ గోన్‌సాల్వెస్ వాదనలు వినిపించారు. రేషన్ రద్దు వల్ల ఆకలి మరణాలు సంభవించటం చాలా పెద్ద సమస్య అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అమన్ లేఖి ఈ వాదనను తోసిపుచ్చారు. రేషన్ కార్డులు రద్దు చేశారనే ఆరోపణలు తప్పని పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు దీనిపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందంది. రేషన్ కార్డుల రద్దుపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
