ట్రాన్స్​ఫర్లు​ ఎక్కువ.. పోస్టింగ్ లు తక్కువ..!

  • టీచర్ల నియామకాలు చేపట్టినా తీరని కొరత
  • రేగోడ్, అల్లాదుర్గం మండలంలో బోధనకు ఇబ్బందులు

రేగోడ్, అల్లాదుర్గం, వెలుగు: ఇటీవల ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరతతో బోధనకు ఆటంకం కలుగుతుండగా ప్రభుత్వం కొత్త టీచర్ల నియామకాలు చేపట్టింది. సమస్య తీరుతుందని స్టూడెంట్స్​, వారి తల్లి దండ్రులు భావించినా పరిస్థితి మరో విధంగా మారింది. చాలా ఏళ్ల తర్వాత ప్రభుత్వం ట్రాన్స్​ఫర్స్​కు అవకాశం ఇవ్వడంతో ఉన్న టీచర్లు చాలా మంది  వెళ్లిపోగా  కొత్త టీచర్లు అంతకంటే తక్కువ రావడంతో సమస్య మరింత పెరిగింది. కొన్నాళ్ల కింద జరిగిన ట్రాన్స్​ఫర్స్​లో రేగోడు మండలంలోని వివిధ ప్రైమరీ స్కూళ్ల నుంచి 33 ఎస్జీటీలు ఇతర మండలాలకు బదిలీ అయ్యారు.

  కాగా ఇటీవల జరిగిన డీఎస్సీ నియామకాల్లో రేగోడ్ మండలానికి కేవలం 21 మంది ఎస్జీటీలను మాత్రమే విద్యాశాఖ అధికారులు కేటాయించారు. అంతకుముందు మండలంలో  మొత్తం 44 ఎస్జీటీ స్థానాలు ఖాళీగా ఉన్నట్టు చూపించారు. కానీ పోస్టింగ్​లలో కేవలం 21 మందిని మాత్రమే కేటాయించారు. దీంతో రేగోడ్ మండలలో టీచర్ల కొరత మరింత పెరిగింది. గతంలో చౌదర్పల్లి  స్కూల్​లో 50 మందికి పైగా స్టూడెంట్స్ కు ఇద్దరు టీచర్లు ఉండగా ప్రస్తుతం ఒక్కరినే నియమించారు. 

రేగోడ్ ప్రైమరీ స్కూల్ లో  గతంలో  హెచ్ఎం తో పాటు ఐదుగురు టీచర్లు బదిలీ అయ్యారు. 180 స్టూడెంట్స్ ఉన్న ఈ స్కూల్​కు ప్రస్తుతం నలుగురు ఎస్జీటీలను మాత్రమే కేటాయించారు. ఇదివరకు కొత్వాల్ పల్లి ప్రైమరీ స్కూల్లో 85 మంది విద్యార్థులకు గాను హెచ్ఎం, ముగ్గురు టీచర్లు ఉండగా వారందరూ బదిలీపై వెళ్లగా, ఇపుడు కేవలం ఇద్దరూ ఎస్జీటీలను మాత్రమే కేటాయించారు. రేగోడ్​  మండలంలో మొత్తం14 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండగా అందులో 9 స్కూల్స్ కి ఇద్దరు టీచర్లు అవసరం ఉన్నప్పటికీ ఒక్కొక్కరిని కేటాయించారు.  

అల్లాదుర్గంలో పరిస్థితి..

మండలంలోని ప్రైమరీ స్కూల్స్ నుంచి 22 మంది టీచర్లు ట్రాన్స్​ఫర్​కాగా కొత్త నియామకాల్లో16 మంది టీచర్లను మాత్రమే కేటాయించారు. మండల పరిధిలోని ముస్లాపూర్ ప్రైమరీ స్కూల్లో 125 స్టూడెంట్స్ కి గతంలో ఐదుగురు టీచర్లు ఉండగా ప్రస్తుతం ముగ్గురు టీచర్లను మాత్రమే కేటాయించారు. గడిపెద్దాపూర్ ప్రైమరీ స్కూల్లో 174 స్టూడెంట్స్ ఉండగా గతంలో ఎనిమిది ఎస్జీటీ, ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఉండగా ట్రాన్స్​ఫర్​అనంతరం ముగ్గురు ఎస్జీటీలను మాత్రమే కేటాయించారు.

 చేవెళ్ల యూపీఎస్​లో  53 మంది స్టూడెంట్స్​కు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు ఎస్జీటీలు, ఇద్దరు లాంగ్వేజ్ పండిట్లను కేటాయించారు. బహిరన్​ దిబ్బ యూపీఎస్​లో 34 మంది స్టూడెంట్స్ కి ఇద్దరు ఎస్జీటీలు, ఒక స్కూల్ అసిస్టెంట్ ని నియమించారు.

టీచర్ల కేటాయింపులో అన్యాయం

మండలంలో టీచర్ల కొరత ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మంది టీచర్లను కేటాయించాలని డీఈవోకు వినతి పత్రం అందజేశాం. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు రేగోడు మండలానికి టీచర్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం చేశారు. ఈ విషయాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్లాం. 

మున్నూరు కిషన్, టీపీసీసీ మెంబర్

మా మండలానికి అన్యాయం

టీచర్ల నియామాకాల్లో విద్యాశాఖ అధికారులు మా మండలానికి అన్యాయం చేశారు. జిల్లా కేంద్రానికి సమీప మండలాల్లోని స్కూళ్లలో సరిపడా టీచర్లు ఉన్నప్పటికీ మిగిలిన ఖాళీలను భర్తీ చేసి మా మండలానికి టీచర్లు రాకుండా చేశారు. 

డి. వినయ్, నోబుల్ యూత్, రేగోడ్

డీఈవో దృష్టికి తీసుకెళ్లాం  

మండలానికి అరకొర టీచర్లను కేటాయించడంతో టీచర్ల సర్దుబాటు తీవ్ర ఇబ్బందిగా మారింది. స్టూడెంట్స్​కు బోధనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయమై జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లాం. 2008 డీఎస్సీ అభ్యర్థులను ముందుగా రేగోడు మండలానికి కేటాయిస్తామని మాటిచ్చారు. వాళ్లు వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉండనుంది.

గురునాథ్​, ఎంఈవో, రేగోడ్​