హైదరాబాద్, వెలుగు: నాగ్‌పూర్ విమానాశ్రయ బిడ్డింగ్ కేసులో జీఎంఆర్ గ్రూపు విజయం సాధించింది. బిడ్డింగ్‌ను నిలిపివేస్తూ మిహాన్ (మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ ఎయిర్పోర్ట్ ఎట్ నాగపూర్) ఇండియా లిమిటెడ్ 2020 మార్చి 19న జారీ చేసిన లేఖను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. మిహాన్ ఇండియన్ లిమిటెడ్, మహారాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టివేసింది. జీఎంఆర్ రిట్ పిటిషన్‌ను అనుమతించింది. హైకోర్టు పేర్కొన్న అంశాలు చట్టానికి లోబడి ఉన్నాయని, వాటిలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ తీర్పు కారణంగా అధికారులు గతంలో నాగ్‌పూర్ విమానాశ్రయం కోసం జీఎంఆర్ తో ఏర్పరచుకున్న కన్సెషన్ ఒప్పందాన్ని అమలు చేయాలని జీఎంఆర్ తెలిపింది. 2019లో నాగ్‌పూర్ విమానాశ్రయం కోసం మిహాన్ ఇండియా లిమిటెడ్ నిర్వహించిన టెండర్లలో జీఎంఆర్ హయ్యెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. జీఎంఆర్‌కి మార్చి 2019లో లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 2020లో టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని నిర్ణయించింది. దీనిని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ 2021 ఆగస్టులో కొట్టివేయగా, అదే తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్ట్ సమర్థించింది.
