కాలేజీల్లో కులవివక్షపై ఏం చర్యలు తీసుకున్నరు:సుప్రీం కోర్టు

  • వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల డేటా ఇవ్వండి
  • యూజీసీకి సుప్రీంకోర్టు​ ఆదేశం
  • రోహిత్​ వేముల తల్లి పిటిషన్​పై విచారణ

న్యూఢిల్లీ, వెలుగు: కాలేజీల్లో కులవివక్షపై వచ్చిన కంప్లైంట్స్, వాటి ఆధారంగా తీసుకున్న చర్యల డేటా ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్స్ లో ఈక్వల్ ఆపర్చునిటీ సెల్స్ ఏర్పాటుపై సమాచారం అందజేయాలంది.కాలేజీల్లో కులవివక్షను నిర్మూలించేలా తగిన చర్యలను కోరుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్​సీయూ) విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల, ఆదివాసీ విద్యార్థిని పాయల్ తాడ్వి తల్లి అబేద సలీం తాడ్వి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన బెంచ్ విచారించింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై నాలుగు వారాలలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేలా కేంద్రానికి, యూజీసీకి, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ కు ఆదేశాలు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్, దిశా వాడేకర్ వాదనలు వినిపించారు. విద్యాసంస్థలలో కుల వివక్షను నిర్మూలించేలా రూల్స్ ను అమలు చేయడంలో యూజీసీ విఫలమైందని కోర్టుకు నివేదించారు. కులాల వారీగా విద్యార్థుల ఆత్మహత్యలపై డేటాను ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. 2004–2024 మధ్య ఉన్నత విద్యా సంస్థలు ఐఐటీల్లో 115 ఆత్మహత్యలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న బెంచ్ ఈ అంశంపై టైమ్ ప్రకారం విచారణ జరుపతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 28కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. హెచ్​సీయూలో పీహెచ్​డీ విద్యార్థి రోహిత్ వేముల 2016లో ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు కులవివక్షే కారణమని, తన ఉపకారవేతనం నిలిపివేశారని, యూనివర్సిటీ నుంచి సస్పెండ్ కూడా చేశారని సూసైడ్ లెటర్​లో రోహిత్ పేర్కొన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో కాంగ్రెస్​అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి రోహిత్​ తల్లి, కుటుంబాన్ని పరామర్శించారు.