అతిపెద్ద ఐపీఓకు రెడీ అవుతున్న సౌదీ ఆరామ్‌‌కో

అతిపెద్ద ఐపీఓకు రెడీ అవుతున్న సౌదీ ఆరామ్‌‌కో
  • 1.71 లక్షల కోట్ల డాలర్ల వాల్యుయేషన్‌‌
  • సౌదీ ఆరామ్‌‌కో ఐపీఓ టార్గెట్‌‌ ఇది
  • 1.5 శాతం వాటా అమ్మకం
  • 25.6 బిలియన్‌‌ డాలర్లు వచ్చే చాన్స్‌‌

రియాద్‌‌:

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్‌‌ కంపెనీ సౌదీ ఆరామ్‌‌కో.. అతిపెద్ద ఐపీఓకు రెడీ అవుతోంది. వాల్యుయేషన్‌‌పై భారీ టార్గెట్‌‌ పెట్టుకుంది. పబ్లిక్‌‌ ఇష్యూ ద్వారా 1.6 ట్రిలియన్‌‌ డాలర్ల నుంచి 1.7 ట్రిలియన్‌‌ డాలర్ల వరకు వాల్యుయేషన్‌‌ సాధించాలని కోరుకుంటోంది. అయితే సౌదీ యువరాజు మహ్మద్‌‌ బిన్‌‌ సల్మాన్‌‌ కోరిక మాత్రం రెండు ట్రిలియన్‌‌ డాలర్ల వాల్యుయేషన్‌‌. ఆరామ్‌‌కోను పబ్లిక్‌‌ ఇష్యూకు తీసుకురావాలని 2016లోనే ఆయన అనుకున్నా, సాధ్యం కాలేదు. ఈ ఐపీఓ ద్వారా స్థానిక స్టాక్‌‌ ఎక్సేంజ్‌‌ తడావుల్‌‌లో ఆరామ్‌‌కో 1.5 శాతం వాటా అమ్ముతుంది. ఫలితంగా 25.6 బిలియన్‌‌ డాలర్లు (దాదాపు రూ.1.83 లక్షల కోట్లు) సమకూరుతాయి. ఐపీఓ ద్వారా ఇంత మొత్తం రాబట్టడం ఇదే తొలిసారి. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌‌ హోల్డింగ్‌‌ 2014లో ఐపీఓ ద్వారా 25 బిలియన్ డాలర్లను సేకరించింది. ఆరామ్‌‌కో వాల్యుయేషన్‌‌ టార్గెట్‌‌ను చేరుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్‌‌ కంపెనీగా అవతరిస్తుంది. ప్రస్తుతం నంబర్‌‌వన్‌‌ స్థానంలో ఉన్న ఆపిల్‌‌ను వెనక్కి నెట్టేస్తుంది. అయితే లోకల్‌‌, ఇంటర్నేషనల్‌‌ లిస్టింగుల ద్వారా 100 బిలియన్ డాలర్ల వరకు రాబడతామని సల్మాన్‌‌ గతంలో ప్రకటించారు.  ఆరామ్‌‌కో ఐపీఓపై ఇంటర్నేషనల్‌‌ మనీ మేనేజర్ల నుంచి తక్కువ స్పందన రావడంతో అమెరికా, కెనడా, జపాన్‌‌లో షేర్లను లిస్ట్‌‌ చేయడం లేదు. లోకల్‌‌ ఇన్వెస్టర్లపైనే ఆరామ్‌‌కో ఆశలు పెట్టుకుంది.

యూరప్‌‌లో రోడ్‌‌షో

ఆరామ్‌‌కో సీఈఓ అమిన్‌‌ నాజర్‌‌ రియాద్‌‌లోని లోకల్‌‌ ఫండ్‌‌ మేనేజర్ల కోసం ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్ సందర్భంగా ఐపీఓ చివరిదశను ప్రారంభించారు. ఈవారంలో యూరప్‌‌ దేశాల్లో రోడ్‌‌షో కూడా ఉంటుంది. ఈ సందర్భంగా నాజర్‌‌ మాట్లాడుతూ ఆరామ్‌‌కో ఐపీఓ సౌదీ అరేబియాలో చరిత్రాత్మకమని అన్నారు. లిస్టెడ్‌‌ కంపెనీగా మారుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అయితే ఐపీఓ ప్రాస్పెక్టస్‌‌లో కార్నర్‌‌స్టోన్‌‌ ఇన్వెస్టర్లు పేర్లు కనిపించలేదు. ఐపీఓ ద్వారా ఇంత మొత్తం ఇన్వెస్ట్‌‌ చేస్తామని ముందస్తుగా హామీ ఇచ్చిన వారిని కార్నర్‌‌స్టోన్‌‌ ఇన్వెస్టర్స్‌‌ అంటారు. అయితే ఇదే విషయమై ఆరామ్‌‌కో ఆఫీసర్లు మిడిల్‌‌ ఈస్ట్‌‌, చైనా, రష్యా ఫండింగ్‌‌ కంపెనీలతో చర్చిస్తున్నారు. అయినప్పటికీ, స్థానిక సంపన్న కుటుంబాల ఇన్వెస్ట్‌‌మెంట్లపైనే ఆరామ్‌‌కోకు ఎక్కువ ఆశలు ఉన్నాయి. ఎందుకంటే, రెండు లక్షల కోట్ల డాలర్ల వాల్యుయేషన్‌‌ అసాధ్యమని, 1.5 లక్షల కోట్ల వరకు అయితే ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ గురించి ఆలోచిస్తామని ఫారిన్‌‌ ఇన్వెస్టర్లు చెబుతున్నారు. ఈ వాల్యుయేషన్‌‌ ప్రకారం వచ్చే ఏడాది 75 మిలియన్ డాలర్ల డివిడెండ్‌‌ ఇస్తామని ఆరామ్‌‌కో ఇది వరకే ప్రకటించింది. డివిడెండ్‌‌ రాబడి 4.4 శాతం నుంచి 4.7 శాతం వరకు వస్తుందని చెప్పింది. ఆరామ్‌‌ కో ప్రత్యర్థి కంపెనీలు ఎక్సాన్‌‌ మొబిల్‌‌ ఐదు శాతం లోపు, షెల్‌‌ 6.4 శాతం డివిడెండ్‌‌ ఇస్తున్నాయి.

ఎగబడి కొంటారంటున్న ఎనలిస్టులు

ఐపీఓకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, దీనిని విజయవంతం చేయడానికి సౌదీ ఆరామ్‌‌కో అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటున్నది. పన్నురేటును ఇది వరకే మూడుసార్లు తగ్గించింది. రిటైల్‌‌ ఇన్వెస్టర్లకు భారీగా డివిడెండు, బోనస్‌‌ షేర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆరామ్‌‌కో ఐపీఓ మూడు రెట్ల వరకు ఓవర్‌‌ సబ్‌‌స్క్రయిబ్‌‌ కావొచ్చని అబూ ధబీలోని షువా క్యాపిటల్‌‌ పోర్ట్‌‌ఫోలియో మేనేజర్‌‌ ఆర్తి చంద్రశేఖరన్‌‌ అన్నారు. భారీగా డివిడెండ్‌‌, బోనస్‌‌ షేర్లు ఇస్తామని హామీ ఉంది కాబట్టి సెకండరీ మార్కెట్లోనూ ఆదరణ ఉంటుందని ఆమె వివరించారు. అయితే వాల్యుయేషన్‌‌ ఎంతకు చేరినప్పటికీ, షేర్ల అమ్మకం ద్వారా ఈ కంపెనీకి విపరీతమైన లాభాలు వస్తాయని ఎనలిస్టులు చెబుతున్నాయి. గత ఏడాది ఈ కంపెనీకి 111 బిలియన్‌‌ డాలర్ల నికర ఆదాయం వచ్చింది.

ముఖ్యాంశాలు

ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు ఆపిల్‌‌, గూగుల్‌‌, ఎక్సాన్‌‌ మొబిల్‌‌ల మొత్తం లాభం ఆరామ్‌‌కో లాభానికి సమానం!

ఈ ఐపీఓ ప్రైస్‌‌ రేంజ్‌‌  ఒక్కో షేరుకు 30 రియాల్స్‌‌ నుంచి 32 రియాల్స్ వరకు ఉండొచ్చు. తుది ధరను, వాల్యుయేషన్‌‌ వివరాలను వచ్చే నెల ఐదున ప్రకటిస్తారు

మొదట స్థానిక ఎక్సేంజ్‌‌ (తడావుల్‌‌)లోనే లిస్టింగ్‌‌ ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్‌‌లో షేర్ల లిస్టింగ్‌‌ ఉండదు.

సౌదీ సంపన్నులు ఈ ఐపీఓలో భారీగా ఇన్వెస్ట్‌‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, లిస్టింగ్‌‌ తేదీని ఇంకా ప్రకటించలేదు. డిసెంబరు 11న మొదలవుతుందని అంచనా.

గత ఏడాది సౌదీ ఆరామ్‌‌కోకు 111 బిలియన్ డాలర్ల నికర ఆదాయం వచ్చింది. అంతర్జాతీయ చమురు మార్కెట్లో దీని వాటా 10 శాతం వరకు ఉంటుంది.

ఐపీఓ ద్వారా వచ్చే నిధులను పబ్లిక్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫండ్‌‌కు బదలాయిస్తారు. వీటిని రియల్‌‌ ఎస్టేట్‌‌, ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వంటి రంగాల్లో ఇన్వెస్ట్‌‌ చేస్తారు.

రిలయన్స్‌‌ గ్రూప్‌‌లో సౌదీ ఆరామ్‌‌కో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. రిలయన్స్‌‌ చమురు, పెట్రోకెమికల్స్‌‌లో ఆరామ్‌‌కో 20శాతం వాటాలను కొనుగోలు చేయనుంది.

Saudi Aramco seeks $1.71 trillion valuation in world’s biggest IPO