పంచాయతీ ఎన్నికలకు పైసల భయం!..పోటీ చేసేందుకు సర్పంచులు వెనుకంజ

  • లక్షలు పెట్టి గెలిచి చివరికి అప్పులపాలైన సర్పంచులు
  • భార్య మెడలోని పుస్తెలమ్మి మరీ అభివృద్ధి పనులు
  • గత పదేండ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్
  • ఇటు ఫండ్స్, అటు పవర్స్ లేని దయనీయ పరిస్థితి
  • ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్నా పల్లెల్లో కనిపించని జోష్

హైదరాబాద్, వెలుగు : త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ రెడీ అవుతున్నా, పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదు. ఒకప్పుడు గ్రామాల్లో సర్పంచ్​ పదవికి మంచి క్రేజ్ ఉండేది. ఫండ్స్, పవర్స్ ఉండడం వల్ల ఓ పది పనులు చేస్తే.. పేరు రావడంతో పాటు చేతిలో నాలుగు పైసలు ఆడేవి. కానీ గడిచిన పదేండ్లలో పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి గెలిస్తే, అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో సర్పంచులపై పనుల భారం మోపింది. మెడ మీద కత్తి పెట్టి మరీ పనులు చేయించింది.

దీంతో దొరికినకాడల్లా మిత్తికి తెచ్చి, నగలు కుదవబెట్టి, చివరికి భార్య మెడలో పుస్తెలమ్మి సర్పంచ్​లు పనులు చేశారు. కానీ తర్వాత బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచులంతా అప్పులపాలయ్యారు. ఈ క్రమంలో అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక దాదాపు 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ బకాయిల కోసం తిరుగుతున్న మాజీ సర్పంచులను చూసి గ్రామాల్లో చాలామంది ఆ పదవి పేరు చెప్తేనే ఆమడదూరం పోతున్నారు. అందుకే ప్రభుత్వం ఓవైపు ఎన్నికలకు రెడీ అవుతున్నా.. పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదని పలువురు చెబుతున్నారు.

గత పదేండ్లలో అప్పటి సర్కార్ వ్యవహరించిన తీరుతో పంచాయతీల్లో అభివృద్ధి సంగతేమో గానీ, సర్పంచులు మాత్రం అప్పులపాలై రోడ్డునపడ్డారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల ఆదేశాలతో ఎలాంటి సర్క్యులర్లు, జీవోలు లేకుండా సర్పంచులు పల్లెల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, మన ఊరు- మన బడి పనులు చేయడంతో పాటు క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. వీధిలైట్ల నిర్వహణ, మురుగు కాలువల నిర్మాణం, మిషన్ భగీరథ, పారిశుధ్యం తదితర పనుల కోసం సొంతంగా ఖర్చు చేశారు.

ఈ క్రమంలో చాలామంది సర్పంచులు 3 నుంచి 5 రూపాయల మిత్తికి అప్పులు తెచ్చారు. ఇంకొందరు సర్పంచులు భార్య మెడలోని పుస్తెలమ్మి మరీ అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ సర్కార్ నుంచి బిల్లులు రాకపోవడం, వడ్డీల భారం రోజురోజుకు పెరిగిపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక ఆగమయ్యారు. అప్పులవాళ్ల వేధింపులు భరించలేక దాదాపు 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వందలాది మంది తమ పదవులకు రాజీనామా చేశారు. అప్పటి మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోని ఇల్లంతకుంట మండలం సోమరాంపేట సర్పంచ్ వడ్డే ఆనంద్ రెడ్డి బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారు.

హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోట్ పల్లి సర్పంచ్ కంచ కుమారస్వామి సూసైడ్​చేసుకున్నారు. కాగా, అప్పులు చేసి ఆయన కట్టించిన శ్మశాన వాటికలో కుమారస్వామి డెడ్​బాడీకే తొలి దహన సంస్కారం కావడం అప్పట్లో  కలచివేసింది. రంగారెడ్డి జిల్లా కాశగూడెం గ్రామ సర్పంచ్ అజారుద్దీన్, సంగారెడ్డి జిల్లా నాగిల్​గిద్ద మండలం మావి నేల సర్పంచ్ చంద్రప్ప ఇలా.. చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ! 

పల్లెల్లో కనిపించని జోష్​..

ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ఒకప్పుడు ఎన్నికల గడువుకు ఆరు నెలల ముందే గ్రామాల్లో హడావిడి మొదలయ్యేది. టికెట్ల కోసం ఎమ్మెల్యేల దగ్గర క్యూకట్టి పైరవీలు చేసుకునేవారు. పార్టీలు, కులాల వారీగా విందు రాజకీయాలు జోరుగా సాగేవి. కొన్నిచోట్ల చాటుమాటుగా సర్పంచ్​పదవులకు వేలం పాటలు నిర్వహించేవారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు గ్రామపెద్దలు కసరత్తు ప్రారంభించేవారు.  కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎక్కడా, ఎలాంటి సందడి కనిపించడం లేదు.

సర్పంచులెవరో ముందే నిర్ణయించే వీడీసీ(విలేజ్​డెవలప్​మెంట్​కమిటీ)ల ప్రభావం ఉన్న నిజామాబాద్, నిర్మల్ లాంటి జిల్లాల్లోనూ, రాయ్స్​సెంటర్ల ఎఫెక్ట్​ఉన్న ఆదిలాబాద్​జిల్లాలోనూ ఇదే పరిస్థితి! ఆదాయం ఎక్కువగా ఉండే గ్రామాల్లోనూ ఎన్నికలపై చర్చ జరగడం లేదు. గతంలో అప్పులపాలైన మాజీ సర్పంచులను, బిల్లుల కోసం నేటికీ తిరుగుతున్న వాళ్ల తిప్పలను చూసే చాలామందికి పంచాయతీ ఎన్నికలంటే ఏవగింపు కలిగిందని

 అందువల్లే ఎవరూ పోటీకి ఆసక్తి చూపడం లేదంటున్నారు. అందువల్లే గ్రామాల్లో సందడి కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల మాజీ సర్పంచులు ఈసారి ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తున్నారు. పంచాయతీల్లో ఫండ్స్ లేకపోవడం, సర్పంచుల అధికారాలకు కత్తెర వేయడమే ఇందుకు కారణమని స్పష్టం చేస్తున్నారు. 

పెద్ద మొత్తంలో పెండింగ్ ​బిల్లులు..

రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా.. అన్నిచోట్లా పల్లెప్రగతి పనులు చేపట్టాలని నాటి సర్కార్ ఆదేశించింది. కలెక్టర్లను రంగంలోకి దింపి, పనులను పరుగు పెట్టించింది. పనులు ప్రారంభించని సర్పంచులపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది. దీంతో సర్పం చులు దొరికినకాడల్లా అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు  బిల్లులు చెల్లించాల్సిన గత​ప్రభుత్వం సర్పంచులకు వేల కోట్లలో బిల్లులు పెండింగ్​పెడ్తూ వచ్చింది.

ఎన్నికల ముందు కొంత మొత్తం క్లియర్​ చేసినప్పటికీ, కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చే నాటికి సర్పంచులకు ఏకంగా రూ.1,300 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్​పడ్డాయి. ప్రభుత్వం మారాక ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి దాదాపు రూ.750 కోట్ల బిల్లులు చెల్లించగా, మరో  రూ.450 కోట్లు నేటికీ పెండింగ్​లోనే ఉన్నట్లు సర్పంచులు చెప్తున్నారు. ఈ బిల్లుల కోసం ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. 

పంచాయతీ అధికారాలకు కత్తెర..

పంచాయతీలకు వచ్చే ఆదాయ మార్గాలన్నీ గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. గ్రామాల్లోని గ్రానైట్, ఇసుక క్వారీలు, క్రషర్ల ద్వారా గతంలో పంచాయతీలకు వచ్చిన 25 శాతం సీనరేజీ నిధులను ఆపేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పంచాయతీలకు వచ్చే ‘ట్రాన్స్​పోర్ట్​ డ్యూటీ’ని  ఎత్తివేస్తూ  జీవో జారీ చేసింది. ఇక పంచాయతీలకు మాత్రమే దక్కాల్సిన ఉపాధి హామీ నిధులను దారి మళ్లించింది. దీనికి తోడు గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి రూ.5 లక్షలు పెట్టి కొత్త ట్రాక్టర్, రూ.1.88 లక్షలు పెట్టి ట్రాక్టర్ ట్రాలీ, రూ.1.83 లక్షలు పెట్టి ట్యాంకర్​ను నాటి సర్పంచుల చేత అప్పటి ప్రభుత్వం కొనిపించింది. వాటి నిర్వహణకు సైతం సర్పంచ్​లు అష్టకష్టాలు పడ్డారు.

రూ.4,182 కోట్లు దారి మళ్లింపు..

గత ప్రభుత్వం పదేండ్లలో స్థానిక సంస్థలకు రూ.10,170 కోట్ల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కేటాయించింది. కానీ, అందులో కేవలం రూ. 5,988 కోట్లు విడుదల చేసి, మిగిలిన రూ. 4,182 కోట్లు దారి మళ్లించింది. ఇలా 42 శాతం నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించడంతో పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి.

ప్రచారానికి కూడా పైసల్లేవ్..  

గత ఎన్నికల్లో ప్రజా సేవ చేయాలనే ఉత్సాహంతో  పోటీ చేసి సర్పంచ్​గా గెలుపొందా. సర్కార్ చెప్పిందని సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేసిన. కరోనా టైంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పనిచేశా. చేసిన పనులకు సంబంధించి నాకు ప్రభుత్వం నుంచి ఇంకా రూ. 60 లక్షలు రావాలి. చాలామంది సర్పంచ్ లు ఆస్తులు అమ్మి, భార్య పుస్తెలు తాకట్టు పెట్టి మరీ పనులు చేశారు. బిల్లులు రాక కొందరు సూసైడ్​ చేసుకున్నారు. మళ్లా ఎన్నికలంటేనే వణుకుపుడుతున్నది. ప్రచారానికి కూడా మా దగ్గర పైసల్లేవ్. మేమే కాదు, ఎవరు కూడా పోటీకి ఇంట్రెస్ట్​ చూపడం లేదు.

మందడపు అశోక్ కుమార్, మాజీ సర్పంచ్, అడవిమల్లెల గ్రామం, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా

సర్పంచి పదవి అంటేనే భయపడుతున్నరు.. 

సర్పంచులుగా చేసినోళ్లంతా అప్పులపాలు కావడంతో ఆ పదవి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం పంచాయతీలకు భారీగా నిధులు వస్తాయని ఆర్భాటం చేయడంతో అప్పులు చేసి పనులు చేయించారు. కానీ, పదవీకాలం ముగిసినా డబ్బులు రాక మాజీ సర్పంచ్ లు మళ్లీ ఎన్నికల జోలికి వచ్చే పరిస్థితి కనబడటం లేదు.

- బిచ్చానాయక్, కారేపల్లి, ఖమ్మం జిల్లా

ఊళ్లల్లో పెద్దగా ఊపు లేదు.. 

అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు రెండు, మూడేండ్ల నుంచి బిల్లులు రాక అప్పులపాలైన్రు. తెచ్చిన పైసలకు మిత్తి పెరిగిపోయింది. చాలా మందికి ఎన్నికల ఖర్చులు కూడా రాలేదు. వాళ్ల పరిస్థితి చూసినంక సర్పంచ్​గా పోటీ చేయాలంటేనే భయమైతంది. పోటీలు పడి పైసలు పంచుడు, తర్వాత అప్పుల పాలవడం తప్ప.. మిగిలేది ఏమీ లేదు. మా ఊళ్లెనైతే సర్పంచ్ ఎన్నికలొస్తే పోటీ చేయాలన్న ఊపు మీద పెద్దగా లేరు.   

- పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి, రంగాపూర్, కరీంనగర్​ జిల్లా

నాడు పండుగలా ఉండేది.. 

గతంలో పంచాయతీ ఎన్నికలకు 6నెలల ముందు నుంచే పల్లెల్లో పండుగ వాతావరణం ఉండేది. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలను అప్పుల కుప్పగా మార్చేసింది. చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాక సర్పంచ్​లు అప్పుల్లో ఉన్నారు. తిరిగి ఇప్పుడు వాళ్లు మళ్లా పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. 

- హనుమంతు, పల్లెగడ్డ గ్రామం, మరికల్ మండలం, మహబూబ్​నగర్​ జిల్