సరబ్‌జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కన్నుమూత

సరబ్‌జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కన్నుమూత

పాకిస్తాన్ జైలులో గూఢచారి అనే ముద్రతో 22 ఏళ్ల పాటు జైలు శిక్ష, చిత్రహింసలు అనుభవించి ఖైదీల దాడిలో మరణించిన సరబ్‌జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ మరణించారు. శనివారం (జూన్ 26న)  రాత్రి ఆమె మరణించారు. పంజాబ్‌లోని భిఖివిండ్‌లో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె తన జీవితంలో తమ్ముడు విడుదల కోసం అలుపెరగకుండా పోరాటం చేశారు.

ఎవరీ సరబ్ జిత్ సింగ్..? 
సరబ్‌జిత్ సింగ్ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈయన సొంతూరు పంజాబ్ రాష్ట్రంలోని భిఖివిండ్‌. ఈ ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది. వ్యవసాయం చేసుకుని జీవించే సరబ్‌జిత్ సింగ్.. ఒకరోజు అనుకోకుండా సరిహద్దు దాటాడు. దీంతో పాకిస్తాన్ అధికారులు ఆయనను ఓ గూఢాచారి అని కట్టుకథలు చెప్పి జైలులో వేశారు.  పాకిస్తాన్ కోర్టు ఆయనకు మరణ శిక్ష వేసింది. 1991 నుంచి 2013 వరకు సరబ్‌జిత్ సింగ్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవించాడు. తన తమ్ముడుని విడుదల చేయించేందుకు సోదరి దల్బీర్ కౌర్ రాజీలేని పోరాటం చేశారు. ఆమె నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. దల్బీర్ కౌర్ తమ్ముడు  సరబ్‌జిత్ సింగ్ విడుదల కోసం అలుపెరగకుండా శ్రమించారు. 

మరణ శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2013లో జైలులోనే కొందరు దుండగులు సరబ్‌జిత్ సింగ్‌పై దాడి చేశారు. తోటి ఖైదీల దాడిలో గాయపడ్డ సరబ్‌జిత్ సింగ్‌ను హాస్పిటల్ తీసుకెళ్లారు. తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. లాహోర్‌లోని జిన్నా హాస్పిటల్‌లో సరబ్‌జిత్ సింగ్ సుమారు 5 రోజుల పాటు కోమాలోనే ఉన్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.

తమ్ముడు విడుదల కోసం రాజీలేని పోరాటం


సరబ్‌జిత్ సింగ్ పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో22 ఏళ్ల పాటు దల్బీర్ కౌర్ తమ్ముడి విడుదల కోసం పోరాడారు. సరబ్‌జిత్ సింగ్ అమాయకుడని, అనుకోకుండానే సరిహద్దు దాటాడని ఆమె అధికారులకు చెబుతూనే వచ్చారు. తన సోదరుడిని చూడటానికి ఆమె పాకిస్తాన్ కూడా వెళ్లారు. సరబ్‌జిత్ సింగ్ మరణంపై దర్యాప్తు చేయాలని అప్పటి భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది. దల్బీర్ కౌర్ కూడా ఇదే డిమాండ్ వినిపించారు. తన తమ్ముడు సరబ్‌జిత్‌పై దాడి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రణాళికనే అయితే దర్యాప్తు అవసరం లేదని, కానీ, అధికారులకు తెలియకుండా తన తమ్ముడిపై దాడి జరిగి ఉంటే మాత్రం కచ్చితంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.