IND vs BAN 2024: ఉప్పల్‌లో బౌండరీల హోరు.. 40 బంతుల్లోనే శాంసన్ సెంచరీ

ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా చెలరేగి ఆడుతుంది. సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్ విధ్వంసం సృష్టిస్తూ బంగ్లాకు చుక్కలు చూపిస్తున్నారు. బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. కొడితే సిక్సర్ లేకపోతే ఫోర్ అన్నట్టుగా భారత్ ఇన్నింగ్స్ కొనసాగుతుంది. ఈ క్రమంలో సంజు శాంసన్ బంగ్లా బౌలర్లను చితక్కొడుతూ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శాంసన్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ 10 ఓవర్లో రిషద్ బౌలింగ్ లో సంజు వరుసగా 5 సిక్సర్లు బాదడం మ్యాచ్ కు హైలెట్ గా మారింది.    

మరో ఎండ్ లో సూర్య కుమార్ యాదవ్ (65) హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ మొదటి 12.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 173 పరుగులు చేసింది. శాంసన్, సూర్య రెండో వికెట్ కు 62 బంతుల్లోనే 159 పరుగులు జోడించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రారంభంలోనే అభిషేక్ శర్మ (4) వికెట్ కోల్పోయింది. వికెట్ పడినా భారత్ జోరు ఆగలేదు. ఓపెనర్ సంజుతో పాటు.. కెప్టెన్ సూర్య విజృంభించడంతో 82 పరుగులు రాబట్టింది.