IND vs SA 4th T20: సౌతాఫ్రికాపై ఊచకోత.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన శాంసన్-తిలక్ జోడి

సౌతాఫ్రికాతో జోహెన్స్‎బర్గ్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా యంగ్ ప్లేయర్స్ సంజు శాంసన్, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగారు. అతిథ్య సౌతాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ ఇద్దరూ మెరుపు సెంచరీలు బాదారు. సంజు శాంసన్, తిలక్ వర్మ పోటీ పడి మరీ స్టేడియంలో పరుగుల వరద పారించారు.  సంజు శాంసన్ 56 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 111 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 47 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లు బాది 120 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

తద్వారా సంజు శాంసన్, తిలక్ వర్మ జోడి టీ20ల్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‎లో రెండో వికెట్‎కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడిగా సంజు శాంసన్, తిలక్ వర్మ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఈ రికార్డ్ గతంలో కూడా భారత్ పేరిటే ఉండటం గమనార్హం. 2022, జూన్ 28న ఐర్లాండ్‌పై భారత బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్,  దీపక్ హుడా రెండో వికెట్‎కు176 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. 

ALSO READ | IND vs SA 4th T20: శాంసన్ సిక్సర్ పవర్.. బాల్ దవడకు తగిలి ఏడ్చేసిన అమ్మాయి

ఇప్పటి వరకు టీ20ల్లో సెకండ్ వికెట్‎కు ఇదే హ్యాయొస్ట్ పార్ట్‎నర్‎షిప్. తాజాగా ఈ రికార్డ్‎ను సంజు శాంసన్, తిలక్ వర్మ జోడి బద్దలు కొట్టింది. వీరిద్దరూ రెండో వికెట్‎కు 86 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు చేసి టీ20ల్లో రెండో వికెట్‎కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడిగా చరిత్ర సృష్టించారు. తిలక్, సంజు శాంసన్ వీరవీహారం చేయడంతో ఈ మ్యా్చ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి 283 పరుగుల భారీ స్కోర్ చేసింది.