IND vs SA 4th T20: సెంచరీలతో శివాలెత్తిన శాంసన్, తిలక్.. సౌతాఫ్రికా ముందు కొండంత లక్ష్యం

జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. వాండరర్స్ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించారు. వచ్చినవారు వచ్చినట్టు సఫారీ బౌలర్లను చితకొట్టారు. సంజు శాంసన్, తిలక్ వర్మ పోటీ పడి మరీ పూనకం వచ్చినట్టు ఆడారు. ఇద్దరు మెరుపు సెంచరీలు చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 111 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 47 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.   
 
ఓపెనర్ల జోరు.. సంజు, తిలక్ హోరు
 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ మెరుపు ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 73 పరుగులు జోడించారు. ఈ దశలో 36 పరుగులు చేసిన అభిషేక్ శర్మ ఔటయ్యాడు. అయితే అసలు ప్రళయం ఇప్పుడే స్టార్ట్ అయింది. మూడో టీ20లో సెంచరీతో జోరు మీదున్నతిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరోవైపు శాంసన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా పరుగుల వరద పారించారు. ఇద్దరూ ఒక్క ఓవర్ కూడా వదలకుండా సౌతాఫ్రికా బౌలర్లను దంచికొట్టారు. 

ALSO READ | IPL 2025 Mega Auction: అధికారిక ప్రకటన.. మెగా వేలానికి 574 మంది క్రికెటర్లు

ఈ క్రమంలో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 51 బంతుల్లో సంజు శాంసన్ మొదట సెంచరీ చేసుకున్నాడు. సంజు టీ 20 కెరీర్ లో ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఈ సిరీస్ లో రెండోది. మరోవైపు అంతమించిన విధ్వంసంతో తిలక్ వర్మ 41 బంతుల్లోనే టీ20 క్రికెట్ లో వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తెలుగు కుర్రాడి ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు 7 ఫోర్లున్నాయి. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 86 బంతుల్లోనే 210 పరుగులు జోడించడం విశేషం. ఈ మ్యాచ్ లో భారత్ మొత్తం 23 సిక్సర్లు కొట్టింది. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ కు ఏకైక వికెట్ దక్కింది.