ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు : కలెక్టర్ వల్లూరి క్రాంతి

 జిన్నారం, వెలుగు:  ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని సంగారెడ్డి  కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. బుధవారం జిన్నారం మండలం కాజిపల్లి, ఐడిఏ బొల్లారం లో పర్యటించారు. కాజిపల్లి లోని 181 సర్వే నెంబర్ కాలనీ  లోని వలస కుటుంబాలకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. కొంతమంది వ్యక్తులు సర్వేనెంబర్181లో కాలువ ఉన్నట్లు హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో  రికార్డులను పరిశీలించారు. అనంతరం రికార్డుల ప్రకారం 1940 నుంచి ఎలాంటి కాలువ లేదని అధికారులు తెలపడంతో అలాంటి ఫిర్యాదులను పట్టించుకోవద్దని అధికారులకు చెప్పారు.

అనంతరం స్కూల్ కోసం స్థల పరిశీలన చేశారు,  తాగునీటి సమస్య ఉందని వలస కుటుంబాలు చెప్పగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వలస కుటుంబాల మౌలిక వసతులకు కృషి చేస్తామని ఆమె అన్నారు. అనంతరం బొల్లారంలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. బొల్లారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.  బొల్లారం శివారులోని మాధవాని కుంటను పరిశీలించారు.

ఎఫ్ టి ఎల్ కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో గాయత్రీ దేవి, మున్సిపల్ చైర్ పర్సన్ రోజా బాల్‌రెడ్డి, కమిషనర్ మంగతాయారు, ఎమ్మార్వో భిక్షపతి, ఇరిగేషన్ డీఈ  రామస్వామి, అధికారులు దిలీప్ మధుసూదన్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి పవన్, డాక్టర్ నిర్మలారెడ్డి, ఆర్వో నర్సింలు పాల్గొన్నారు.