18 ఏండ్ల నిరీక్షణకు తెర

  •      సంగంబండ నిర్వాసితుల అకౌంట్లలో రూ. 8.49 కోట్లు జమ
  •     త్వరలో ప్రారంభం కానున్న లెఫ్ట్​ లో లెవల్​ కెనాల్  పనులు
  •     7 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు

మక్తల్, వెలుగు : 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నిర్వాసితుల అకౌంట్లలో రూ.8.49 కోట్లను ప్రభుత్వం జమ చేయడంతో సంగంబండ లెఫ్ట్​ లో లెవల్​ కెనాల్​ పనులు పూర్తి చేసేందుకు అడ్డంకి తొలగిపోయింది. ఈ కెనాల్​ పూర్తయితే దాదాపు 7 వేల ఎకరాలకు సాగునీరందనుంది. భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా సంగంబండ రిజర్వాయర్ 3.317 టీఎంసీల సామర్థ్యంతో 68 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించారు. రిజర్వాయర్ పూర్తయినా ఎడమ లో లెవల్ కెనాల్ కింద 7వేల ఎకరాలకు సాగునీటిని అందించే పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

ఈ కెనాల్  కింద నారాయణపేట జిల్లా మక్తల్  మండలంలోని గూర్లపల్లి, దాసర్ దొడ్డి, వనయకుంట, తిర్మలాపూర్, మాగనూరు మండలంలోని వడ్వాట్, అమ్మపల్లి, అడవిసత్యారం, మాగనూరు ప్రాంతాల్లో 7వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే  కాల్వ తీసే దగ్గర 200 మీటర్ల మేర బండరాయి ఉండగా, రైతులు తమకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లిస్తేనే రాయిని తొలగించేందుకు సహకరిస్తామని తేల్చి చెప్పడంతో అప్పటి నుంచి పనులు పెండింగ్​లో ఉన్నాయి.

రిజర్వాయర్ లోని లెఫ్ట్  కెనాల్ కు సంబంధించిన భూములకు పరిహారం డబ్బులు అప్పట్లోనే అందించగా, ఆ గ్రామ రైతులకు పునరావాసం కల్పించేంత వరకు  ప్రభుత్వం రోజు కూలీ పేరుతో డబ్బులు చెల్లించాలి. ఇలా 2005 నుంచి 2019 వరకు దాదాపు 8.50 కోట్ల పునరావాసం కూలీ డబ్బులు పెండింగ్​లో ఉన్నాయి. అప్పటి నుంచి బండరాయి తొలగింపు పనులు నిలిచిపోయాయి.

ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చొరవతో..

ఇటీవల మక్తల్​ ఎమ్మెల్యేగా గెలిచిన వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ సమస్య పరిష్కారమైందని అంటున్నారు. బండరాయి తొలగింపు పనులు అడ్డుకోవడంతో సాగునీళ్లు అందడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఏండ్ల నుంచి పెండింగ్​లో ఉన్న డబ్బులు ఇప్పించాలని నిర్వాసితులు ఎమ్మల్యేకు విన్నవించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్​లో ఉన్న డబ్బులు రిలీజ్​ చేయించడంతో ఈ సమస్యకు తెరపడినట్లైంది.

త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిపించి బండరాయి తొలగింపు పనులు ప్రారంబించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ పనులు పూర్తి చేసి లెఫ్ట్​ లో లెవల్ కెనాల్  కింద ఉన్న గ్రామాలకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. దీంతో ఆయాగ్రామాల ప్రజలు ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్  ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి వరుసగా సంగంబండ రైతుల సెల్ ఫోన్లలో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు మెసేజ్ లు

రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పునరావాసం కూలీ డబ్బుల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నామని వారు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.