సాహసమే ఊపిరిగా..

సాహసమే ఊపిరిగా..

కొంచెం ఎత్తు నుండి కిందకి చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఈమె 35 వేల అడుగుల ఎత్తు నుంచి ధైర్యంగా కిందకు దూకుతుంది. చిన్నప్పటి నుంచి ఆకాశంలో ఎగరాలని కలలు కన్నది. ఇప్పుడు ప్రొఫెషనల్​ స్కై డైవర్ అయింది. తన పేరు అనామికా శర్మ.  మన దేశంలోని ఐదో మహిళా ప్రొఫెషనల్‌‌ స్కై డైవర్‌‌‌‌. చిన్న వయసులోనే అమెరికాలోని యునైటెడ్‌‌ స్టేట్స్‌‌ పారాచూట్‌‌ అసోసియేషన్‌‌ (యుయస్‌‌పిఎ) నుండి ‘ఎ’ కేటగిరి సర్టిఫికెట్, లైసెన్స్ పొందింది అనామికా. అంతేకాదు ఇంటర్నేషనల్​ స్కై డైవింగ్ పోటీల్లో గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది ఈ యంగ్​స్టర్​. సాహసమే శ్వాసగా ఆకాశంలో దూసుకెళ్తున్న ఆమె జర్నీ ఇది.

ఒక్కొక్కరికి ఒక్కో ప్యాషన్‌‌ ఉంటుంది. దాన్ని నెరవేర్చుకున్న రోజే జీవితంలో నిజమైన సంతోషం  దొరుకుతుంది. అయితే, కొందరు పేరెంట్స్​ అమ్మాయిల్ని కెరీర్ విషయంలో సొంతంగా  నిర్ణయం తీసుకోనివ్వరు. దాంతో వాళ్లు కన్నవాళ్ల మనసు కష్టపెట్టడం ఇష్టం లేక తమ ప్యాషన్​ని పక్కన పెట్టేస్తారు. వాళ్లు చెప్పిన కోర్స్​, జాబ్ చేస్తారు. కానీ, అనామిక పేరెంట్స్ అలా చేయలేదు. కూతురి కలని అర్థం చేసుకొని ఎంకరేజ్ చేశారు. దాంతో, మన దేశంలోనే అతి చిన్న వయసున్న  స్కై డైవర్‌‌‌‌గా రికార్డుకెక్కింది 21 ఏండ్ల అనామికా శర్మ. 

తండ్రే మొదటి కోచ్‌‌
అనామిక తండ్రి అజయ్‌‌ కుమార్‌‌‌‌ శర్మ రిటైర్డ్‌‌ ఇండియన్‌‌ ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌ ఆఫీసర్‌‌. ప్రొఫెషనల్ స్కై డైవర్ కూడా. చిన్నప్పటి నుండే ఆయన తన ఇద్దరు కూతుళ్లతో ‌‌ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు చేయించేవాడు. తండ్రి స్కై డైవింగ్ చేస్తుంటే చూసి, తను కూడా అలాగే చేయాలని అనుకుంది అనామిక. కూతురి ఇష్టాన్ని తెలుసుకున్న ఆయన చిన్నప్పటి నుండే ఆమెకు స్కై డైవింగ్​లో కోచింగ్‌‌ ఇచ్చాడు. తండ్రి ఎంకరేజ్​మెంట్​తో పదకొండు ఏండ్ల వయసులో 10 వేల అడుగుల ఎత్తు నుండి కిందకు దూకి 
అప్పట్లోనే వార్తల్లోకి ఎక్కింది అనామిక. అప్పటి నుండి స్కైడైవింగ్​ను కెరీర్​గాఎంచుకుంది. అందులోనే ఏదైనా గొప్పగా సాధించాలని కలలు కన్నది. స్కై డైవింగ్​లో మెలకువలు నేర్చుకునేందుకు మాస్కోలో పోయిన ఏడాది ఆగస్ట్‌‌– సెప్టెంబర్‌‌‌‌  మధ్యలో, ఈ ఏడాది  2022 జనవరి నెలలో దుబాయ్‌‌లో ట్రైనింగ్‌‌ తీసుకుని స్కై డైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంది. అనామిక ఇప్పటి వరకు 42 సార్లు సోలో, గ్రూప్‌‌ జంప్‌‌లు చేసింది. అంతేకాదు పది రకాల పారాచూట్​లు, ఆరు రకాల ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌ల నుండి కిందకు దూకింది. ప్రస్తుతం  బెంగళూరు‌‌లో బీ.టెక్​ చదువుతోంది.
 

మొదటి అడుగు వేయాలని..
స్కై డైవింగ్​లో మహిళలు చాలా తక్కువ. ఇప్పటివరకు భారతీయ మహిళలు  స్కై డైవింగ్‌‌ ఇంటర్నేషనల్‌‌ కాంపిటీషన్‌‌లో పాల్గొనలేదు. దాంతో, నాలుగేండ్లకు ఒకసారి జరిగే  ఈ పోటీల్లో మనదేశం నుంచి మొదటి అడుగు వేయాలని నిర్ణయించుకుంది అనామిక.  ఇతర దేశాల స్కై డైవర్స్​కు గట్టి పోటీ ఇవ్వడం కోసం సీరియస్​గా ప్రాక్టీస్​ చేస్తోంది.   ‘లక్ష్యాలను చేరుకోవడం ఎవరికీ అంత ఈజీ కాదు. కలల్ని నిజం చేసుకోవాలంటే కష్ట పడాలి. స్కై డైవింగ్​ని కెరీర్​గా తీసుకుంటాను అని చెప్పగానే మా నాన్న ‘సరే.. నీ ఇష్టం’ అన్నారు. దాంతో, నాకు రెక్కలు వచ్చినట్టు అనిపించింది. ఆకాశంలోంచి కిందకు దూకుతున్నప్పుడు పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతున్న ఫీలింగ్​ కలుగుతుంది. నేలను తాకిన తర్వాత మనసంతా సంతోషం నిండుతుంది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’ అంటోంది అనామిక.

 

మరిన్ని వార్తల కోసం:

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

నువ్వా–నేనా!: అంబానీ–అదానీల మధ్య ముదురుతున్న పోటీ

సమ్మర్‌‌‌‌లో సమంత సిటాడెల్‌!