అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‎లోని నటుడు అల్లు అర్జున్ నివాసం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బన్నీ నివాసం వద్దకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ప్లాటున్ టీమ్స్ చేరుకున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణకు హాజరు కావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‎కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హీరో ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సెక్యూరిటీ టైట్ చేశారు. 

కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు హాజరు కావాలని అల్లు అర్జున్‎కి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2024, డిసెంబర్ 24 ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు పోలీసులు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్న అల్లు అర్జున్ ఇవాళ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరి కాసేపట్లో తన న్యాయవాదులతో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‎కు స్టైలిస్ స్టార్ బయలుదేరనునట్లు సమాచారం.

ALSO READ : పుష్ప విచారణకు వెళ్తాడా.. వెళ్లడా..? అల్లు అర్జున్ నిర్ణయంపై ఉత్కంఠ

తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‎ను విచారించి పోలీసులు స్టేట్‎మెంట్ రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే పోలీసులు ఇటీవల విడుదల చేసిన వీడియో ఆధారంగా బన్నీని ప్రశ్నించనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్‎లోని బన్నీ నివాసం వద్ద ఫ్యాన్స్‎ను కంట్రోల్ చేయడానికి జూబ్లీహిల్స్ పోలీసులు రెండు ప్లాటున్స్ సిద్ధం చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు కూడా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండడంతో పీఎస్ దగ్గర కూడా పోలీసులు సెక్యూరిటీని టైట్ చేశారు.