జూన్‌‌‌‌‌‌‌‌ 2న సనత్‌‌‌‌‌‌‌‌నగర్ టిమ్స్ ప్రారంభం : మంత్రి కోమటి రెడ్డి

  • 14 ఎకరాల విస్తీర్ణంలో రూ.882 కోట్ల వ్యయంతో 3 బ్లాకుల్లో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం
  • ఆస్పత్రి పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

జూబ్లీహిల్స్, వెలుగు: పేద ప్రజలకు కార్పొరేట్​స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎర్రగడ్డలో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. వచ్చే ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్​2న ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభిస్తామని, అందుకనుగుణంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

14 ఎకరాల్లో రూ.882 కోట్ల వ్యయంతో 3 బ్లాకుల్లో వెయ్యి పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 5 హాస్పిటళ్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నిమ్స్ ఆవరణలో జరుగుతున్న నిర్మాణం 2025 చివరి నాటికి పూర్తవుతుందని తెలిపారు. ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మిస్తున్న దవాఖాన వచ్చే ఆగస్టులో ప్రారంభం అవుతుందని వెల్లడించారు. అల్వాల్ టిమ్స్‌‌‌‌‌‌‌‌కు స్థల సమస్య ఉందని, దీంతో ఎన్వోసీ ఇప్పించామన్నారు.

వరంగల్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరో మూడు నెలల్లో గోషామహాల్ స్టేడియంలో ఉస్మానియా కొత్త హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో ఎమర్జెన్సీ పికప్, డ్రాప్ పాయింట్స్ విశాలంగా ఉండేలా నిర్మించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆయన వెంట రోడ్లు, భవనాల శాఖ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, కాంగ్రెస్ నేత కోట నీలిమ, సీఈ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.