ఎస్సీ గురుకులాల్లో ప్రాజెక్టు సంపూర్ణ

  • విద్యార్థులకు విలువల ఆధారిత విద్యే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం
  • ఎస్సీ గురుకులాల్లో ఇప్పటివరకూ 100 స్కూళ్లలో అమలు
  • వచ్చే అకడమిక్ ఇయర్​లో సొసైటీలోని మొత్తం స్కూళ్లకు విస్తరణ 
  • టీచర్లకు ఎమోషనల్ లెర్నింగ్, కరికులంపై శిక్షణ
  • సంపూర్ణ శిశు అభివృద్ధి దిశగా మెరుగైన ఫలితాలు

హైదరాబాద్, వెలుగు:  గురుకులాల్లో విద్యార్థులకు, టీచర్లకు భావోద్వేగాల నియంత్రణపై అవగాహన కల్పించేలా ఎస్సీ గురుకులాల సొసైటీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిద్వారా గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన విద్యను అదించడంతో పాటు చెడు అలవాట్ల నుంచి దూరం చేసి మంచి అలవాట్లను టీచర్లు నేర్పిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా మంచి ఫలితాలు వస్తున్నాయి. అందువల్ల ఏటా ఈ కార్యక్రమాన్ని అమలు చేసే స్కూళ్ల సంఖ్యను పెంచుతున్నారు. విద్యార్థులకు విలువల ఆధారిత టీచింగ్ ద్వారా వారిలో గొప్ప వ్యక్తిత్వం పెంపొందుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత సాంకేతిక, డిజిటల్ యుగంలో మానవ సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు ఆత్మ నూన్యతాభావం, భయం, ఇంటి మీద బెంగను దూరం చేసి.. ఇతర స్టూడెంట్లతో కలుపుగోలుగా, స్నేహంగా ఉండటం, ఆత్మ విశ్వాసంతో ముందుకు అడుగు వేసేలా చేయడంలో ప్రాజెక్టు సంపూర్ణ మెరుగైన ఫలితాలను ఇస్తోందని చెప్తున్నారు. 

టీచర్లకు ఎమోషనల్ లెర్నింగ్ శిక్షణ

ప్రాజెక్టు సంపూర్ణలో భాగంగా స్టూడెంట్లు, టీచర్ల మధ్య భావోద్వేగాలతో కూడిన మానవ సంబంధాలను నెలకొల్పేందుకు, విద్యార్థుల అవసరాలను టీచర్లు తీర్చే విధంగా హోల్ చైల్డ్ డెవలప్ మెంట్ (హెచ్ సీడీ) కార్యక్రమాన్ని చేపడుతున్నారు. టీచర్లు, పూర్వ విద్యార్థులు, హెడ్ మాస్టర్లు, రీజనల్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్లు (ఆర్సీవో), గురుకుల హెడ్ ఆఫీస్ లో ఉండే ఉన్నతాధికారులతో కూడిన 35 మంది సభ్యుల కార్యవర్గం రూపొందించిన ప్లాన్స్ ఆధారంగా విమెన్ చైల్డ్ డెవలప్ మెంట్(డబ్ల్యూసీడీ) ఫ్రేమ్ వర్క్ రూపొందించారు. 

టీచర్లకు ఇంటిగ్రేటెడ్ సోషల్, ఎమోషనల్ లెర్నింగ్, కరికులం శిక్షణ ద్వారా విద్యార్థుల తరగతి గది అంచనా, స్కిల్ డెవలప్ మెంట్ కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. కో కరికులమ్ గేమ్ లతో స్టూడెంట్లకు ఉన్న నాలెడ్జ్ ను అంచనా వేయగలిగే విధంగా సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ దోహదపడుతుందని అంటున్నారు. వీటిలో ప్రధానంగా సమావేశాలు, విద్యార్థులు సెలవులకు వెళ్లి ఇంటి నుంచి తిరిగి వచ్చినప్పుడు, కొత్తగా గురుకులాల్లో చేరినపుడు వారి సమస్యలను విని టీచర్లు సరైన గైడెన్స్ అందింస్తున్నారు. ఫలితాలను రాబట్టేందుకు ర్యాపిడ్ ఎవాల్యూవేయేషన్, అసెస్ మెంట్, లెర్నింగ్ మెథడ్స్ ను టీచర్లు అమలు చేస్తున్నారు.   

ఎన్జీవోల తోడ్పాటుతో.. 

ప్రాజెక్టు సంపూర్ణను ఎన్జీవోల భాగస్వామ్యంతో ఎస్సీ గురుకులాల సొసైటీ అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యం, జీవన నైపుణ్యాలు, అభ్యాసం, క్రీడలపై విద్యార్థుల్లో ప్రత్యేక వైఖరులు పెంపొందుతున్నాయని గురుకుల అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు 2023–2024 అకడమిక్ ఇయర్ లో 61 స్కూళ్లలో అమలు కాగా, ఈ అకడమిక్ ఇయర్ లో 100 స్కూళ్లకు విస్తరించిందని.. వచ్చే అకడమిక్ ఇయర్ లో ఎస్సీ గురుకులాల్లోని అన్ని మొత్తం 238 స్కూళ్లలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని అంటున్నారు.