IND vs AUS: బాక్సింగ్‌‌ డే టెస్టులో ఇండియా తడబాటు.. ఆఖరి అర్ధ గంటలో ఆగమయ్యారు

  • తొలి ఇన్నింగ్స్‌‌లో 164/5తో ఎదురీత
  • స్మిత్‌‌ సెంచరీ.. ఆసీస్‌‌ 474 ఆలౌట్‌‌

మెల్‌‌బోర్న్‌: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తీరు మారడం లేదు. బాక్సింగ్ డే టెస్టుల్లోనూ మన  బ్యాటర్లు పల్టీ కొట్టారు. యంగ్‌‌ ఓపెనర్‌‌‌‌ ‌‌ యశస్వి జైస్వాల్ (118 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 82) అద్భుతంగా పోరాడినా ఆఖరి 30 నిమిషాల్లో మూడు వికెట్లు కోల్పోయిన ఇండియా నాలుగో టెస్టులో కష్టాల్లో పడింది. శుక్రవారం, రెండో రోజు ఆటలో ఓ దశలో 153/2తో పటిష్ట స్థితిలో కనిపించిన జట్టు జైస్వాల్ అనూహ్య రనౌట్ తర్వాత డీలా పడి 164/5తో నిలిచింది. లోకల్ హీరో బోలాండ్‌‌ (2/24 ), కెప్టెన్ కమిన్స్‌‌ (2/57) సూపర్‌‌‌‌ బౌలింగ్‌‌తో రోహిత్‌‌సేనను దెబ్బకొట్టారు. 

అంతకుముందు స్టీవ్ స్మిత్ (197 బాల్స్‌‌లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 140) భారీ సెంచరీతో విజృంభించడంతో ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 311/6తో ఆట కొనసాగించిన కంగారూ టీమ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 474 వద్ద ఆలౌటైంది. కమిన్స్ (49) కూడా రాణించాడు. బుమ్రా 4, జడేజా 3, ఆకాశ్‌‌ దీప్‌‌ 2  వికెట్లు పడగొట్టారు. తర్వాత ఆసీస్‌‌ స్కోరులో సగం కూడా చేయకుండానే  ఐదు  వికెట్లు కోల్పోయిన ఇండియా ఇంకా 310 రన్స్ వెనుకంజలో ఉంది. విరాట్ కోహ్లీ (36), కేఎల్‌‌ రాహుల్ (24) కాసేపు పోరాడినా కెప్టెన్ రోహిత్ శర్మ (3) మళ్లీ నిరాశపరిచాడు.  ప్రస్తుతం రిషబ్ పంత్ (6 బ్యాటింగ్‌‌), రవీంద్ర జడేజా (4 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. ఫాలోఆన్‌‌ తప్పించుకోవాలన్నా ఇంకా 111 పరుగులు చేయాలి. 

సూపర్ స్మిత్‌‌

తొలి రోజు భారీ స్కోరుకు పునాది వేసుకున్న ఆసీస్‌‌ను స్టీవ్‌‌ స్మిత్ సూపర్ సెంచరీతో మరింత పటిష్ట స్థితిలోకి తీసుకెళ్లాడు. మరో ఎండ్‌‌లో అతనికి కమిన్స్‌‌ అద్భుతమైన సహకారం అందించాడు. ఉదయం కొత్త బంతితో ఇండియా పేసర్లను ఇద్దరూ మెరుగ్గా ఎదుర్కొన్నారు. బుమ్రా కట్టడి చేసే బంతులు వేసినా వికెట్ సాధించలేకపోయాడు. మరో ఎండ్‌‌లో అతనికి సహకారం కరువైంది.  సిరాజ్‌‌ (0/122) చెత్త బౌలింగ్‌‌తో విసుగెత్తించాడు. దాంతో స్వేచ్ఛగా ఆడిన స్మిత్ భారీ షాట్లతో అలరించాడు. 167 బంతుల్లో  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

తొలి రోజుతో పోలిస్తే  రెండో రోజు అతను  చాలా వేగంగా బ్యాటింగ్‌‌ చేశాడు. పుల్‌‌, హుక్ షాట్లతో బుమ్రా, సిరాజ్‌‌ బౌలింగ్‌‌లో సిక్సర్లు కొట్టాడు. వాతావరణం చల్లబడినా ఇండియా పేసర్లతో పాటు స్పిన్నర్లూ  ప్రభావం చూపలేకపోయారు. స్కోరు 400 దాటిన తర్వాత ఆసీస్ మరింత వేగం పెంచే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జడేజా బౌలింగ్‌‌లో షాట్ ఆడిన కమిన్స్‌‌.. నితీశ్‌‌కు క్యాచ్ ఇవ్వడంతో ఏడో వికెట్‌‌కు 112 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఆసీస్‌‌ 454/7తో లంచ్‌‌కు వెళ్లొచ్చిన తర్వాత జడ్డూ బౌలింగ్‌‌లో స్టార్క్‌‌ (15) బౌల్డ్ అయ్యాడు. అదే స్కోరు వద్ద ఆకాశ్‌‌ బాల్‌‌ను స్మిత్ క్రీజు దాటొచ్చి డిఫెన్స్‌‌ చేయగా.. అది అతని ప్యాడ్స్‌‌ను తాకి వెనక్కివెళ్లి వికెట్లను పడగొట్టింది. లైయన్ (13)ను బుమ్రా చివరి వికెట్‌గా ఎల్బీ చేశాడు.

  • 10: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అత్యధికంగా 10 సెంచరీలు చేసిన ప్లేయర్‌‌గా సచిన్, కోహ్లీ (చెరో 9)ని స్మిత్‌ అధిగమించాడు.
  • 34: స్మిత్ కెరీర్‌‌లో ఇది 34వ టెస్టు సెంచరీ. ఇండియాపై అత్యధికంగా 11 సెంచరీలు చేసిన ప్లేయర్‌‌గా జో రూట్ (10) రికార్డు బ్రేక్ చేశాడు.

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ ‌: 122.4 ఓవర్లలో 474  ఆలౌట్‌‌(స్మిత్ 140, కమిన్స్ 49, బుమ్రా 4/99, జడేజా 3/78).
ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌ : 46 ఓవర్లలో 164/5 (జైస్వాల్ 82, కోహ్లీ 36, బోలాండ్ 2/24).