సమ్మెబాటలోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు

  • డిమాండ్లు నెరవేర్చాలంటూ ఇయ్యాల్టి నుంచి విధుల బహిష్కరణ
  • 33 జిల్లాల పరిధిలో 19,360 మంది ఉద్యోగులు
  • ఇప్పటికే నిరసన దీక్షలు చేపట్టిన సిబ్బంది
  • సమ్మె కారణంగా కేజీబీవీలు, యూఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లు, భవిత సెంటర్లు, హైస్కూళ్లలో ఆగనున్న బోధన
  • ఎమ్మార్సీలు, డీఈవో, ఎస్‌‌‌‌పీడీ ఆఫీస్‌‌‌‌లో స్తంభించనున్న పనులు

మెదక్‌‌‌‌/మంచిర్యాల, వెలుగు : తమ డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ) ఉద్యోగులు కొన్ని రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెకు దిగేందుకు సిద్ధమయ్యారు. వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు ‘పెన్‌‌‌‌డౌన్‌‌‌‌, చాక్‌‌‌‌డౌన్‌‌‌‌’ చేస్తుండడంతో  పలు విద్యాలయాల్లో బోధనకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అలాగే ఎంఆర్‌‌‌‌సీలు, డీఈవో, ఎస్పీడీ ఆఫీస్‌‌‌‌లలో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 19,360 మంది

సమగ్ర శిక్ష అభియాన్‌‌‌‌ (ఎస్ఎస్ఏ) రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో వివిధ కేటగిరీల్లో 19,360 మంది పనిచేస్తున్నారు. స్టేట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ (ఎస్పీడీ) ఆఫీస్‌‌‌‌లో ప్లానింగ్‌‌‌‌ కో ఆర్డినేటర్‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌ ప్రోగ్రాం ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జిల్లా స్థాయిలో డీపీఎంలు, ఏపీవోలు, సిస్టం అనలిస్ట్‌‌‌‌లు, టెక్నికల్‌‌‌‌ పర్సన్లు, డీఎల్ఎంటీలు, మెసేంజర్లు, మండల స్థాయిలో ఎంఐఎస్‌‌‌‌ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్పీలు, మెసేంజర్లు

స్కూల్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌ స్థాయిలో క్లస్టర్‌‌‌‌ రిసోర్స్‌‌‌‌ పర్సన్లు (సీఆర్పీ), స్కూల్‌‌‌‌ స్థాయిలో ఆర్ట్, పీఈటీ, వర్క్ ఎడ్యుకేషన్‌‌‌‌ పార్ట్ టైం ఇన్‌‌‌‌స్ట్రక్టర్లు(పీటీఐ), కేజీబీవీల్లో స్పెషల్‌‌‌‌ ఆఫీసర్లు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, క్రాఫ్ట్‌‌‌‌ అండ్‌‌‌‌ కంప్యూటర్ ఇన్‌‌‌‌స్ట్రక్టర్లు, కుక్‌‌‌‌లు, వాచ్‌‌‌‌మెన్‌‌‌‌లు, స్వీపర్లు, స్కావెంజర్లుగా కాంట్రాక్ట్‌‌‌‌ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 18 ఏండ్లుగా రెగ్యులర్‌‌‌‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా పనికి తగిన వేతనం అందడం లేదని, ఉద్యోగ భద్రత లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దశలవారీగా ఉద్యమాలు

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్పందించి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ ఉద్యోగులు దశలవారీగా ఆందోళనలు నిర్వహించారు. ముందుగా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి వినతిపత్రాలు అందజేశారు. గత నెలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ ఉద్యోగులు హైదరాబాద్‌‌‌‌కు తరలివచ్చి ఇందిరాపార్క్‌‌‌‌ వద్ద ధర్నాకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని విద్యాశాఖ ఉన్నతాధికారులకు, డీఈవోలకు నోటీస్‌‌‌‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు.

Also Read : జహీరాబాద్ ట్రైడెంట్ లోక్రషింగ్ కష్టమే!...చేతులెత్తేసిన యాజమాన్యం

ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెకు దిగాలని ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ ఉద్యోగుల యూనియన్‌‌‌‌ లీడర్లు నిర్ణయించారు. 33 జిల్లాల్లో పనిచేసే ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ ఉద్యోగులు విధులు బహిష్కరించి అన్ని జిల్లా కేంద్రాల్లో సమ్మె చేయనున్నారని తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం (టీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌యూఎస్‌‌‌‌) రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్‌‌‌‌ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య, వర్కింగ్​ప్రెసిడెంట్‌‌‌‌ అనిల్‌‌‌‌ చారి తెలిపారు.

మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎఫెక్ట్‌‌‌‌

సమ్మెలో భాగంగా ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ ఉద్యోగులు పెన్‌‌‌‌డౌన్‌‌‌‌, చాక్‌‌‌‌డౌన్‌‌‌‌ నిర్వహించనున్నారు. దీంతో కేజీబీవీలు, అర్బన్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌, భవిత సెంటర్లలో బోధనకు ఆటంకం కలగనుంది. మండల వనరుల కేంద్రాల్లో పనిచేసే కంప్యూటర్లు ఆపరేటర్లు సైతం సమ్మెలో పాల్గొంటుండడంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చే మెయిల్స్‌‌‌‌ చెకింగ్‌‌‌‌ నిలిచిపోనుంది. యూడైస్‌‌‌‌, ఏఏపీఏఆర్, మిడ్‌‌‌‌ డే మీల్స్‌‌‌‌కు సంబంధించిన వివరాల ఆన్‌‌‌‌లైన్‌‌‌‌, బిల్లులు రికార్డు ప్రక్రియపై ఎఫెక్ట్‌‌‌‌ పడనుంది.

క్లస్టర్‌‌‌‌ రిసోర్స్‌‌‌‌ పర్సన్లు లేకపోవడంతో పాఠశాలల పర్యవేక్షణ కొరవడడం, పార్ట్​ టైం ఇన్‌‌‌‌స్ట్రక్టర్లు లేని కారణంగా కంప్యూటర్‌‌‌‌, ఆర్ట్, ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌పై ప్రభావం చూపనుంది. డీపీఎంలు, ఏపీవోలు, డీఎంఎల్‌‌‌‌టీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులకు దూరంగా ఉంటుండడంతో జిల్లా విద్యాశాఖ ఆఫీసుల్లో, ప్లానింగ్​ కోఆర్డినేటర్లు, అసిస్టెంట్‌‌‌‌ ప్రోగ్రాం ఆఫీసర్లు సైతం సమ్మెలో ఉండడంతో స్టేట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి.

రెగ్యులరైజేషన్‌‌‌‌తో పాటు మిగతా బెనిఫిట్స్‌‌‌‌ కోసం...

సమగ్ర శిక్ష అభియాన్‌‌‌‌లో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్​ చేయాలని ఉద్యోగులు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. అప్పటివరకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ప్రతి ఉద్యోగికి రూ.10 లక్షల లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌, రూ.5 లక్షల హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ వర్తింపజేయాలని, పీటీఐలకు కూడా మిగతా ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏల మాదిరిగానే 12 నెలల పాటు జీతం ఇవ్వాలని, రిటైర్మెంట్‌‌‌‌ అయ్యే ఎస్ఎస్ఏ ఉద్యోగులకు బెనిఫిట్స్‌‌‌‌ కింద రూ.20 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు.

తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ గతేడాది ఆగస్ట్‌‌‌‌, సెప్టెంబర్‌‌‌‌లో 25 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2023 సెప్టెంబర్13న వరంగల్‌‌‌‌లో నిర్వహించిన దీక్షా శిబిరానికి అప్పటి టీపీసీసీ చీఫ్‌‌‌‌ రేవంత్‌‌‌‌రెడ్డి హాజరై మద్దతు తెలపడంతో పాటు, తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సీఎం హామీ నిలుపుకోవాలి 

సమగ్ర శిక్ష అభియాన్‌‌‌‌ ఉద్యోగులు 18 ఏండ్ల నుంచి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారు. కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌ను రెగ్యులరైజ్‌‌‌‌ చేస్తామని చెప్పి మోసం చేసింది. గతంలో పీసీసీ చీఫ్‌‌‌‌ హోదాలో రేవంత్‌‌‌‌రెడ్డి మా ఆందోళనకు మద్దతు పలికారు. ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్న రేవంత్‌‌‌‌రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలి.

– సుమలత, సమగ్ర శిక్ష అభియాన్‌‌‌‌ ఎంప్లాయిస్‌‌‌‌ జేఏసీ మంచిర్యాల జిల్లా చైర్మన్‌‌‌‌

ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం 

మా సమస్యల పరిష్కారం కోసం పదేండ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఉద్యోగులను రెగ్యులరైజ్‌‌‌‌ చేయడంతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలి. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే కేజీబీవీ హాస్టళ్లను సైతం బంద్‌‌‌‌ చేసి ఆందోళన ఉధృతం చేస్తాం.

– గజవెల్లి సుమన చైతన్య, ఎస్‌‌‌‌వో, మంచిర్యాల జిల్లా