రెగ్యులరైజేషన్​పై స్పష్టమైన ప్రకటన చేయాలి: సమగ్ర శిక్ష ఉద్యోగులు

బషీర్ బాగ్, వెలుగు: అధికారంలోకి వచ్చిన వెంటనే తమను రెగ్యులరైజ్​చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం బషీర్ బాగ్ లోని హైదరాబాద్ డీఈఓ ఆఫీస్​ముందు 7వ రోజు నిరాహారదీక్షను కొనసాగించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఇంద్రకంటి సరితగౌడ్ మాట్లాడుతూ... 20 ఏండ్లుగా పాఠశాల విద్య బలోపేతానికి తాము కృషి చేస్తున్నామన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులరైజేషన్, పే స్కెల్ పై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు సమ్మెను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నవనీత గౌడ్, కోశాధికారి శ్రీవాణి, రమ్య, ఫరీన్, గిరిజా భవాని, మధురవాణి, మోహన్, సరస్వతి, షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు.