ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మెకు రెడీ!..హామీల అమలుకు మరోసారి పోరుబాట

  • ఇప్పటికే విద్యాశాఖ ఉన్నత, జిల్లా ఆఫీసర్లకు నోటీసులు 
  • రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 19,360 మంది  
  • రెగ్యులరైజ్, మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని డిమాండ్లు

మెదక్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష అభి యాన్​(ఎస్ఎస్ఏ) ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల సాధనకు జాయింట్​ యాక్షన్​ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్ట్​ డైరెక్టర్, ​విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, అన్ని జిల్లాల డీఈఓలకు ఇప్పటికే సమ్మె నోటీసులు అందజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే వచ్చే నెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగాలని కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. విద్యాశాఖలో 33 జిల్లాల్లోని అన్ని మండలాల్లో సీఆర్పీ, పీటీఐ, మెసెంజర్, ఐఈఆర్ పీ, సీసీవో తదితర పోస్టుల్లో19,360 మంది ఎస్ఎస్ఏ ఉద్యోగులు పనిచేస్తున్నారు.  

జిల్లా స్థాయిలో ఏపీఓలు, సిస్టమ్ అనలిస్ట్ లు, టెక్నికల్ పర్సన్లు, డీఎల్ఎంటీలు, మెసెంజర్లు, మండలస్థాయిలో ఎంఐఎస్ కో– ఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్పీలు, మెసెంజర్లు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)లు, స్కూల్ స్థాయిలో ఆర్ట్, పీఈటీ, వర్క్ ఎడ్యుకేషన్ పార్ట్ టైమ్​ఇన్ స్ట్రక్టర్లు(పీటీఐ), కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్లు, పీజీ సీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్ ఇన్​స్ట్రక్టర్లు, కుక్ లు, వాచ్ మెన్ లు,  స్వీపర్లు, స్కావెంజర్లు వంటి విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. 

సీఆర్పీ, ఎంఐఎస్​కు నెలకు రూ.19,350, సీసీఓలకు రూ.18,200, పీటీఐలకు రూ.11,700-, మెసెంజర్లకు రూ.11,000, ఐఈఆర్పీలకు రూ.19,350, -డీఈఓ ఆఫీస్ స్టాఫ్ కు రూ.19,350, కేజీబీవీల్లో స్టాఫ్ కు క్యాడర్ ను బట్టి రూ. 7,000-  నుంచి రూ.25 వేల వరకు శాలరీలు ఉన్నాయి.

 18 ఏండ్లుగా విధులు నిర్వహిస్తుండగా.. 

ఎస్ఎస్ఏ ఉద్యోగులు18 ఏండ్లుగా విధులు నిర్వహిస్తుండగా పనికి తగిన వేతనం, ఉద్యోగ భద్రత లేక ఆందోళన చెందుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా డ్యూటీలు చేస్తున్నా  తగు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. రెగ్యులర్ చేయాలని, మినిమం టైం స్కేల్, రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా చేయాలని కోరుతున్నారు. పీటీఐలకు కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగుల మాదిరిగానే 12 నెలల వేతనం ఇవ్వాలని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కింద రూ.20 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.  

గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ లో 25 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అప్పుడు వరంగల్ లో దీక్షా శిబిరానికి వచ్చిన అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మద్దతు తెలపడంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా తమ సమస్యలు అలాగే ఉన్నాయని ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను కలిసి హామీలు అమలు చేయాలని కోరుతూ వినతి పత్రాలు కూడా అందజేశారు. ఇటీవల రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు తరలివెళ్లి హైదరాబాద్ ఇందిరా పార్క్​ వద్ద ధర్నా చేశారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదని మరోమారు పోరుబాట పట్టాలని ఈసారి సమ్మె చేసేందుకు జాయింట్​యాక్షన్​ కమిటీ (జేఏసీ) నిర్ణయించింది. 

స్పందించకుంటే సమ్మెకు వెళ్తాం

తమను రెగ్యులర్ చేయాలని, మినిమం టైం స్కేల్ వర్తింప జేయాలని గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 25  రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాం. ఆనాడు వరంగల్ లో ధర్నా చౌక్ వద్దకు వచ్చిన అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తమకు మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే సమ్మెకు వెళ్తాం. 

–  యాదగిరి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

సమ్మె చేయక తప్పడం లేదు

తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత11నెలల్లో పలుసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. అయినా న్యాయం చేయడంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో169 మంది ఉద్యోగులు వివిధ కారణాలతో చనిపోయారు. 61 ఏండ్లు నిండిన100 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఎలాంటి రిటైర్ మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వలేదు. దీంతో తమ డిమాండ్ల సాధనకు సమ్మెకు వెళ్లక తప్పడంలేదు. 

– గట్టయ్య, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా తమ సమస్యలు అలాగే ఉన్నాయని ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను కలిసి హామీలు అమలు చేయాలని కోరుతూ వినతి పత్రాలు కూడా అందజేశారు. 

ఇటీవల రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు తరలివెళ్లి హైదరాబాద్ ఇందిరా పార్క్​ వద్ద ధర్నా చేశారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదని మరోమారు పోరుబాట పట్టాలని ఈసారి సమ్మె చేసేందుకు జాయింట్​యాక్షన్​ కమిటీ (జేఏసీ) నిర్ణయించింది.