తెలంగాణ అమర్​ నాథ్​కు వేళాయే.. ఏడాదికి మూడు రోజులే లింగమయ్య దర్శనం

  •     ఈ నెల 22 నుంచి సలేశ్వరం జాతర
  •     వసతుల కల్పనలో ప్రతిసారీ అధికారుల విఫలం
  •     గతేడాది ఇద్దరి భక్తుల మృతి

అచ్చంపేట/ అమ్రాబాద్, వెలుగు: నల్లమలలోని దట్టని అడవుల్లో 200 అడుగుల లోతులో గల లోయలో కొండకోనల మధ్య కొలువుదీరాడు ఆ లింగమయ్య. శివుడి జటాజూటం నుంచి జాలువారినట్టుగా ఇక్కడ కొండలపై నుంచి జలపాతం నిత్యం ప్రవహిస్తుంటుంది. కొండలను చీల్చినట్టుగా ఉండే సన్నటి దారి, పక్షుల కిలకిల రావాలు, భారీ వృక్షాలు.. ఇలా ప్రకృతి, ఆధ్యాత్మికం, సాహసం కలగలిసిన ఈ సుందర ప్రాంతాన్ని మాటల్లో వర్ణించలేం. ఇదంతా కన్నుల నిండుగా చూడాలంటే సలేశ్వరం తరలి వెళ్లాల్సిందే. 

చెంచులే పూజారులు..

తెలంగాణ అమర్​నాథ్​గా పిలిచే ఈ జాతర ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా 3 రోజులే ఉంటుంది. మిగతా రోజుల్లో ఇక్కడా ఎటువంటి జన సంచారం ఉండదు. ఈసారి ఏప్రిల్ 22 నుంచి సలేశ్వర లింగమయ్య జాతర మొదలు కానుంది. 24న పౌర్ణమి కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. 24వ తేదీన జాతర పరిసమాప్తం అవుతుంది. ఈ ఆలయంలో నల్లమల చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు. పగటి పూట సైతం లోయలో చిమ్మచీకటి ఉంటుంది. దీంతో జాతర సమయంలో జనరేటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తారు.

సహజ సిద్ధంగా వెలసిన గుండం

శైలం అంటే కొండ, ఆ కొండల్లో ఈశ్వరుడు వెలిసినందున సలేశ్వరం అని పేరు. లోయలో జలపాతం జాలువారే చోటును సలేశ్వర తీర్థంగా పిలుస్తారు. సహజ సిద్ధంగా వెలసిన ఈ గుండంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. శివుని మహిమతో నిరంతరం పారే ఈ జలంలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని విశ్వాసం. ఈ ఆలయం క్రీ.శ 6,7 శతాబ్దాల కాలనికి చెందినది చరిత్రకారులు పేర్కొంటారు. అయితే, ఇప్పటివరకు ఈ ఆలయానికి సంబంధించి ఎటువంటి శాసనాలు లభ్యం  కాకపోవడంతో ఎవరు ప్రతిష్ఠించారో వెలుగులోకి రాలేదు. 

ప్రతిసారీ అధికారుల విఫలం.. 

ఏడాదికోసారి జరిగే ఈ జాతరకు వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రూ.లక్షల్లో నిధుల ఖర్చు చూపిస్తున్నారు తప్పితే కనీస వసతులు కల్పించలేదనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది కిలో మీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు అష్టకష్టాలు పడ్డారు. ఆలయం వద్ద తోపులాట, తొక్కిసలాట జరిగింది. గతేడాది నాగర్​కర్నూల్ కు చెందిన చంద్రయ్య లోయ దారిలో జారి పడి, ముంబైకి చెందిన విజయ తొక్కిసలాటలో గుండె పోటుకు గురై మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్, డీఎఫ్​ఓలు అధికారులతో రివ్యూ మీటింగ్​ చేపట్టారు. ట్రాఫిక్ జామ్​ కాకుండా అటవీ ప్రాంతంలో ప్రతి 100 మీటర్లకు ఒక చోట బైపాస్​ రోడ్డును ఏర్పాటు చేయాలని సూచించారు.  

ఎలా వెళ్లాలంటే..

జాతర సమయంలో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి రాంపూర్​పెంట వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అక్కడి నుంచి దాదాపు 5 కి.మీ మేర కాలినడకన సలేశ్వరం చేరుకోవాలి. హైదరాబాద్​నుంచి వచ్చే భక్తులు శ్రీశైలం ప్రధాన రహదారిలో ఫర్హబాద్ లేదా అచ్చంపేటలో దిగి ప్రత్యేక బస్సుల ద్వారా రాంపూర్​కు చేరుకోవచ్చు. ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవారికి టోల్ టాక్స్ లు వర్తిస్తాయి.