సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల

అచ్చంపేట/అమ్రాబాద్: తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర సోమవారం(ఏప్రిల్22)  ప్రారంభమైంది.చుట్టూ అడవి, కొండలు, కోనలు మధ్య అటవీ ప్రాంతంలో లోయ గుహలో వెలసిన లింగమయ్య(శివుడిని)ను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడినుంచో తరలివస్తున్నారు.భక్తులు కిలోమీటర్ల మేర కాలినడక కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడి వరకు చేరుకున్నారు. సలేశ్వరం జాతర మూడు రోజుల పాటు సాగనుంది. ఏప్రిల్ 24 వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లింగమయ్య దర్శనానికి అనుమతిచ్చారు అధికారులు. 

 
ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ, కర్నాటక నుంచి వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు. సలేశ్వరం బయలుదేరిన భక్తులు ‘వస్తు న్నాం.. వస్తున్నాం.. లింగమయ్య’ అంటూ చేసిన శరణుఘోషతో నల్లమల అటవీ ప్రాంతం మార్మోగింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్​ వెహికల్స్​లో రాంపూర్​ పెంట వరకు వచ్చిన భక్తులు అక్కడి నుంచి 4 కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.

సలేశ్వరం క్షేత్రం వద్ద 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం వద్ద భక్తులు సందడి చేశారు. చెంచు పూజారులు పూజలు నిర్వహించి భక్తులను ఆశీర్వదిం చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అడవిలో ప్రయాణానికి అధికారులు అనుమతించారు. 

సలేశ్వరం వెళ్లే భక్తుల కోసం నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్​ నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఐటీడీఏ, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్​ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ప్లాస్టిక్​ కవర్లు, బాటిళ్లు ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు అడవిలో ఎలాంటి మంటలు చెలరేగకుండా ఫారెస్ట్​ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. వన్యమృగాల సంచారం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

 ఫర్హాబాద్, మన్ననూర్, రాంపూర్, అప్పాయి పల్లి,  సలేశ్వరం వద్ద ట్రాఫిక్​ నియంత్రణ, ప్లాస్టిక్​ ఏరివేత, ఎమర్జెన్సీ సేవలు అందించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో 75 మంది వాలంటీర్లను నియమించారు. 150 మంది ఫారెస్ట్​  ఆఫీసర్లు, సిబ్బంది అడవిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సలేశ్వరం క్షేత్రం వద్ద వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టే వారికి అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులతో పాటు నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.