సమ్మర్లో నిమ్మకాయ షర్బత్ తాగకుండా సీజన్ దాటలేం అంటే అతిశయోక్తి కాదు. చల్లగా, నీళ్ల నీళ్లుగా కడుపులోకి వెళ్తే ‘ఈ షర్బత్ సల్లగుండ’ అనుకోని వాళ్లు ఉండరు. ఇప్పటికే సూర్యప్రతాపం ఓ రేంజ్లో చూపిస్తున్నాడు. కాబట్టి అందరికీ తెలిసిన నిమ్మకాయ షర్బత్‌తో మరికొన్ని రకాల షర్బత్‌లు చేసుకుని ‘షర్బత్ ఏ ఇష్క్..’ అని పాడుకోవచ్చు.
నోట్ : జెల్లీ తయారు చేసేటప్పుడు అదనంగా నీళ్లు వాడొద్దు. అలా వాడితే జెల్లీ సెట్ కాదు. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేవరకు ఉడికించాలి. లేదంటే పళ్లకు అతుక్కుపోతుంది. పంచదారను రుచికి తగినంత వేసుకోవచ్చు.
పుదీన
కావలసినవి :
పుదీనా - ఒక కట్ట
నీళ్లు - ఐదు కప్పులు
పంచదార - అర కప్పు
నిమ్మరసం - ఒక టీస్పూన్
తయారీ : మూడు కప్పుల నీళ్లను ఐదు నిమిషాలు మరిగించాక అందులో పుదీనా ఆకులు వేయాలి. తరువాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టాలి. మిగిలిన రెండు కప్పుల నీళ్లలో పంచదార వేసి కరిగేవరకు ఉడికించాలి. దీన్ని కూడా చల్లారబెట్టాలి. ఆ తరువాత పుదీనా నీళ్లు వడకట్టి వాటిలో పంచదార నీళ్లను పోసి, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టి పుదీనా షర్బత్ తాగాలన్నప్పుడు కలుపుకుని తాగడమే.
బాదం
కావలసినవి :
బాదం - ఒక కప్పు
పంచదార - నాలుగు కప్పులు
నీళ్లు - రెండు కప్పులు
యాలకుల పొడి - ఒక టీస్పూన్
కుంకుమపువ్వు తీగలు - రెండు
తయారీ : బాదం గింజలను నానబెట్టి పొట్టు తీసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. సాస్పాన్లో పంచదార, నీళ్లు, యాలకలపొడి, కుంకుమపువ్వు తీగలు వేసి ఉడికించాలి. అవి చల్లారాక వడకడితే సాఫ్ట్ లిక్విడ్ తయారవుతుంది. వడకడితే మిగిలిన పేస్ట్‌ను మళ్లీ ఒకసారి గ్రైండ్ చేయాలి. దాన్ని కూడా బాదం నీళ్ల మిశ్రమంలో కలపాలి. బాగా చల్లారాక గాజు సీసాలో నింపి నిల్వ చేయాలి. ఈ బాదం సిరప్‌ను చల్లటి నీళ్లలో లేదా పాలలో కలిపితే టేస్టీ బాదం షర్బత్ తాగేందుకు సిద్ధం.
సగ్గుబియ్యం
కావలసినవి :
జెల్లీ - ఒక ప్యాకెట్
నీళ్లు - ప్యాకెట్ మీద చెప్పినన్ని
సబ్జా గింజలు - ఒక టేబుల్ స్పూన్
నీళ్లు - ఒక కప్పు (సబ్జా గింజలు నానపెట్టడానికి)
సగ్గుబియ్యం - అర కప్పు
నీళ్లు - ఐదు కప్పులు (సగ్గు బియ్యం ఉడికించేందుకు)
పాలు - ఒక లీటర్
పంచదార - పావు కప్పు
రోజ్ సిరప్ - అర కప్పు
పిస్తా - రెండు టేబుల్ స్పూన్స్
బాదం - రెండు టేబుల్ స్పూన్స్
తయారీ : నీళ్లు వేడిచేశాక అందులో జెల్లీ వేసి కలిపి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించాలి. ఈ లిక్విడ్‌ను ఒక గిన్నెలో పోసి పావు గంట కదలకుండా ఉంచాలి. జెల్లీ ప్యాకెట్ మీద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. పావుగంట తరువాత చల్లారిన జెల్లీని చిన్న క్యూబ్స్‌గా చేసి పక్కన పెట్టాలి.
సబ్జాగింజలను నీళ్లలో వేసి పదినిమిషాలు నానబెట్టాలి. అవి బాగా ఉబ్బితే రెట్టింపు సైజ్ అవుతాయి. గిన్నెలో నీళ్లు పోసి అవి ఒక ఉడుకు వచ్చాక సగ్గుబియ్యం వేసి పావుగంట ఉడికించాలి. లేదా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేవరకు ఉడికించాలి. సగ్గుబియ్యం నీళ్లను వడకట్టాలి.
తరువాత మంచి నీళ్లను ఉడికిన సగ్గుబియ్యం మీద ఒకటికి రెండుసార్లు పోసి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం మీద ఉండే స్టార్చ్ పోతుంది.
మిల్క్ బేస్ తయారు చేసేందుకు పెద్ద గిన్నెలో చల్లటి పాలు పోయాలి. అందులో పంచదార వేసి బాగా కలపాలి. తరువాత రోజ్ సిరప్ వేసి మళ్లీ ఒకసారి కలపాలి. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, ఉడికించిన సగ్గుబియ్యం, జెల్లీ క్యూబ్స్, పిస్తా, బాదం వేసి కలిపితే రిఫ్రెషింగ్ సగ్గుబియ్యం షర్బత్ రెడీ.