కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ముందు వరుసలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై వాడివేడి చర్చ జరుగుతోంది. ‘‘కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి పదవి కోసం ఒకవేళ నేను నామినేషన్ వేయాల్సి వచ్చినా.. మీకు దూరం కాదల్చుకోలేదు. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మీరేం బాధపడొద్దు’’ అని ఎమ్మెల్యేలతో గెహ్లాట్ చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యల ద్వారా తాను కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికైనా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకునేది లేదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారంటూ మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. ‘‘భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని చివరిగా ఇంకోసారి కలిసి పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తా ’’ అని కూడా ఎమ్మెల్యేలతో అశోక్ గెహ్లాట్ చెప్పారని అంటున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా గెహ్లాట్ ఎన్నికైతే.. రాజస్థాన్ సీఎం పదవి మరో కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ కు దక్కొచ్చని కథనాలు వస్తున్నాయి. సచిన్ పైలట్ ప్రస్తుతం రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలపై స్పందించిన సచిన్ పైలట్.. ‘‘ కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలను అప్పగించినా చేపట్టడానికి నేను సిద్ధమే’’ అని ప్రకటించారు. ‘‘అశోక్ గెహ్లాట్ చాలా సీనియర్ నాయకుడు. ఆయన దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజస్థాన్ లో గెలవడమే మా లక్ష్యం’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘కాబోయే రాజస్థాన్ సీఎం మీరేనంట కదా ?’’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘పార్టీ ఏ బాధ్యతలను అప్పగించినా చేపడుతాను’’ అని బదులిచ్చారు.
