- రైతు భరోసా కోసం శాటిలైట్ సర్వే..
- పక్కాగా సాగుభూముల గుర్తింపు
- సర్వే కోసం వివిధ కంపెనీలతో మంత్రి తుమ్మల భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. సాగు భూముల వివరాలను పక్కాగా లెక్కించాలని భావిస్తున్నది. శాటిలైట్ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. రిమోట్‌సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని లెక్కగట్టే వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నది.
నిరుడు పైలట్ ప్రాజెక్టుగా సర్వే!
గతంలో పంటల నమోదు కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.. 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద శాటిలైట్ సర్వే నిర్వహించింది. నిరుడు డిసెంబర్ 20 నుంచి 23 వరకు.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్‌గర్, నారాయణపేట్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. మొత్తం 144 మండలాల్లోని 318 క్లస్టర్లలో ఈ ప్రక్రియ పూర్తిచేసి, సాగు భూములను పక్కాగా లెక్కించారు.
శాస్త్రీయంగా పంటల నమోదు
రాష్ట్రంలో ఇప్పటివరకు పంటల నమోదు ప్రక్రియ పూర్తి అశాస్త్రీయంగా జరుగుతున్నది. వ్యవసాయాధికారులు మాన్యువల్‌గా ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగయ్యాయో లెక్కిస్తున్నారు. ఇందుకోసం రైతులు చెప్పిన వివరాలపైనే ఆధారపడ్తున్నారు. దీనివల్ల వివిధ రకాల పథకాల అమలులో, పంట నష్టం పరిహారం అంచనాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా శాటిలైట్ సర్వేకు సర్కారు మొగ్గుచూపుతున్నది.
ఈ శాటిలైట్ సర్వే ద్వారా క్లస్టర్ల వారీగా ప్రతి 300 మీటర్ల రేడియస్‌లో ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగయ్యాయో కచ్చితంగా లెక్కిస్తారు. శాటిలైట్ సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా, కచ్చితంగా నిర్వహించే కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది. ఈ నెల చివరిలో సర్వే ప్రారంభమై.. జనవరి మొదటి వారంలో పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి భేటీ
ఈ సంక్రాంతి నుంచి రైతుభరోసాను సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇస్తామని, సాగుభూముల గుర్తింపు కోసం శాటిలైట్ సర్వే నిర్వహించబోతున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ఈ మేరకు రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయగల వివిధ కంపెనీ ప్రతినిధులతో శనివారం సెక్రటేరియెట్‌లో సమావేశమయ్యారు. ఏఈవోల ద్వారా ఎప్పటికప్పుడు రైతు వారీగా సాగు వివరాలను నమోదు చేస్తామని, కచ్చితత్వం కోసం గ్రామాల్లో సర్వే నంబర్లవారీగా సాగు భూముల విస్తీర్ణం, అందులో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందో వివరాలను సేకరిస్తామని మంత్రి తెలిపారు.
రైతు భరోసాతో పాటు, పంటల బీమా అమలు, పంటల స్థితి, ఎదుగుదల, చీడపీడలను గుర్తించడం, వరదలు, తుఫానుల వల్ల జరిగే పంటనష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇదే టెక్నాలజీ వినియోగిస్తామన్నారు. కాగా.. ఇప్పటికే తాము రూపొందించిన పంటల వివరాలను వివిధ కంపెనీల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. సాగుకు అనువు గానీ ప్రాంతాలను డిజిటల్ మ్యాప్స్ ద్వారా వివరించారు. పంటలకు వచ్చే చీడ పీడలను గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీతో రూపొందించిన మోడల్స్గురించి వెల్లడించారు.