SA vs PAK: పాకిస్థాన్‌పై సఫారీ బ్యాటర్ పంజా.. డబుల్ సెంచరీతో విధ్వంసం

సౌతాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేప్ టౌన్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ యువ బ్యాటర్ ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 266 బంతుల్లోనే తన డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. రికెల్టన్ ఇన్నింగ్స్ లో 29 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. తొలి రోజు సెంచరీ చేసి అజేయంగా నిలిచిన రికెల్టన్.. రెండో రోజు అదే జోరు చూపించాడు. వెర్రిన్ సహాయంతో కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేసుకొని..ఇదే ఊపులో 250 పరుగుల మార్క్ అందుకున్నాడు.

259 పరుగుల వద్ద భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో అతని మారథాన్ ఇన్నింగ్స్ కు బ్రేక్ పడింది. 2016 తర్వాత సౌతాఫ్రికా గడ్డపై ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. చివరిసారిగా ప్రస్తుత ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ సౌతాఫ్రికాలో సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికా తరపున వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఐదో క్రికెటర్ గా రికెల్టన్ చరిత్ర సృష్టించాడు.211 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకొని గిబ్స్ టాప్ లో ఉన్నాడు. పాకిస్థాన్ పై సెంచరీ చేసిన నాలుగో సౌతాఫ్రికా బ్యాటర్ గా రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

రికెల్టన్ డబుల్ సెంచరీతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 610 పరుగులు చేసింది. రికెల్టన్ (259) డబుల్ సెంచరీకి తోడు తొలి రోజు కెప్టెన్ బవుమా(106) సెంచరీ చేశాడు.  రెండో రోజు వెర్రిన్ (100) మెరుపు  సెంచరీతో చెలరేగాడు. పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ అఘా మూడు వికెట్లు తీసుకున్నాడు. మహమ్మద్ అబ్బాస్, మీర్ హంజాకు రెండు వికెట్లు లభించాయి.