ఉక్రెయిన్ ఆరోపణలను ఖండించిన రష్యా

ఉక్రెయిన్ ఆరోపణలను ఖండించిన రష్యా
  •     ఉక్రెయిన్ ఎంపీ లీసా  వాసిలెంకో  ఆరోపణలు
  •     ఉక్రెయిన్ ఆరోపణలు అబద్ధమని ఖండించిన రష్యా

కీవ్: రష్యా నీతి, జాతిలేని నేరస్తుల దేశమంటూ ఉక్రెయిన్ ఎంపీ లీసా వాసిలెంకో తీవ్ర ఆరోపణలు చేశారు. పౌరులను చంపడమే కాకుండా, ఆడవారిపై ఆత్యచారాలు చేశారని, ఈ మారణహోమాన్ని, రష్యా అధ్యక్షుడు పుతిన్​ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. మరోవైపు రష్యా బలగాలు వెనక్కు వెళ్లాక కీవ్​కు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న 410 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్​ అధికారులు చెప్పారు. వాళ్లను రష్యా సైనికులు హింసించి అత్యంత కిరాతకంగా చంపారని తెలిపారు. బుచా సిటీలో 21 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. అందులో కొందరినీ చేతులు కట్టేసి కాల్చి చంపారని నిర్ధారించారు. కీవ్​కు పశ్చిమాన ఉన్న మోటీజిన్​లో సిటీ మేయర్, ఆమె భర్త, కొడుకు కళ్లకు గంతలు కట్టి చంపేశారని స్థానికులు తెలిపారు. 

దర్యాప్తు చేస్తాం: జెలెన్​ స్కీ

యుద్ధంలో రష్యా అరాచకాలపై దర్యాప్తు చేస్తామని ఉక్రెయిన్​అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్​స్కీ చెప్పారు. ప్రపంచం ఇప్పటిదాకా ఎన్నో యుద్ధ నేరాలను చూసిందని, తమపై రష్యా సాగిస్తున్న యుద్ధ నేరాలే చివరివి అయ్యేలా ప్రపంచం మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. రష్యా అరాచకాలను విచారించేందుకు ప్రపంచంలోని ముఖ్యమైన జడ్జిలు, లాయర్లతో ప్రత్యేక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. 

అన్నీ అబద్ధాలే: రష్యా

ఉక్రెయిన్ ఆరోపణలన్నింటినీ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్​ ఖండించారు. ఉక్రెయిన్​ ప్రజలపై తాము ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదని, అవన్నీ అబద్ధాలేనని సోమవారం ఐక్యరాజ్యసమితి స్పెషల్ ఎన్వాయ్ మార్టిన్ గ్రిఫిత్స్​తో సమావేశం సందర్భంగా చెప్పారు. ఇదంతా రష్యాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు చేస్తున్న ఆరోపణలనేనని ఆయన అన్నారు. యూఎన్ భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరచాలంటూ రష్యా చేసిన విజ్ఞప్తిని.. ప్రస్తుతం భద్రతా మండలి చైర్​లో ఉన్న బ్రిటన్​ తోసిపుచ్చింది. అబద్ధాలు చెప్పేందుకు భద్రతా మండలిని రష్యా వాడుకుంటోందంటూ అమెరికా, బ్రిటన్​ మండిపడ్డాయి.

రెండు తున్కలైన రష్యా హెలికాప్టర్

రష్యన్ ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ ను ఉక్రెయిన్ బలగాలు స్టార్ స్ట్రీక్ లేజర్ గైడెడ్ మిసైల్ తో కూల్చేశాయి. మిసైల్ వచ్చి ఢీకొట్టగానే హెలికాప్టర్ రెండు ముక్కలై కూలిపోతున్న దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్  మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన లుహాన్స్క్ రీజియన్ లో జరిగిందని మీడియా తెలిపింది. బ్రిటన్ అందించిన స్టార్ స్ట్రీక్ మిసైల్ ధ్వని వేగం కంటే మూడు రెట్లు వేగంగా దూసుకెళ్లి శత్రు విమానాలు, హెలికాప్టర్లను పేల్చేయగలదు. అలాగే ఇజియూమ్ ప్రాంతంలో రష్యాకు చెందిన సుఖోయ్ 35ఎస్ యుద్ధ విమానాన్ని కూడా నేలకూల్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ ఘటనలో పైలెట్ ఎజెక్షన్ సీటుతో ప్రమాదం నుంచి బయటపడగా, తాము పట్టుకున్నట్లు తెలిపింది.