జపోరిజియా(ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద పోర్ట్ సిటీ ఒడెస్సాపై రష్యా దాడులను పెంచింది. ఉక్రెయిన్‌కు అమెరికా, యూరోప్ దేశాలు పంపే మిలిటరీ సామగ్రి, ఆయుధాల సప్లయిని దెబ్బ తీయడమే లక్ష్యంగా రష్యా మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. నల్ల సముద్రానికి దగ్గరలోని ఒడెస్సా సిటీపై రష్యా 7 మిస్సైల్స్‌ను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఓ షాపింగ్ మాల్, వేర్‌హౌస్‌పై మిస్సైళ్లు పడటంతో ఒకరు చనిపోగా, పది మంది గాయపడ్డారని చెప్పారు. యుద్ధం మొదలుపెట్టిన నాటి నుంచి నల్ల సముద్ర తీరంలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తొలుత మరియుపోల్ సిటీని టార్గెట్ చేసిన రష్యా.. ఇప్పుడు ఒడెస్సాపై దృష్టి పెట్టింది. సముద్ర తీరంపై పట్టుసాధిస్తే క్రిమియన్ పెనిన్సులా, మాల్డోవా రీజియన్లకు సులువుగా వెళ్లడానికి రష్యాకు వీలవుతుంది. మరియుపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి సాధారణ పౌరుల తరలింపు పూర్తికావడంతో ప్లాంట్‌పైనా రష్యా దాడులు చేస్తోంది. మరోవైపు, ఉక్రెయిన్ బిల్లుపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సంతకం చేశారు. ఉక్రెయిన్‌కు మిలిటరీ, మానవతా సాయం కింద 33 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇవ్వాలని బైడెన్ కోరగా, అమెరికన్ కాంగ్రెస్ నుంచి 40 బిలియన్ల ప్యాకేజీ ఇప్పించేందుకు డెమొక్రాట్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
బిల్డింగ్ శిథిలాల కింద 44 డెడ్ బాడీలు
మార్చిలో రష్యా దాడిలో కూలిపోయిన ఒక బిల్డింగ్ శిథిలాల కింద 44 డెడ్‌బాడీలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. ఖార్కివ్ రీజియన్‌లోని ఇజియం ప్రాంతం పై మార్చిలో రష్యా తీవ్రంగా దాడులు చేసింది. ఈ దాడిలో ఐదంతస్తుల భవనం కూలిపోయింది. లోపల చాలామంది చిక్కుకుపోయారు. తాజాగా చేపట్టిన శిథిలాల తొలగింపు ప్రక్రియలో 44 మృతదేహాలను గుర్తించినట్టు ఖార్కివ్ రీజినల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఓలెహ్ సైనెహ్బోవ్
సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
