ఈ రోడ్ల మీద పోవుడెట్ల, వచ్చుడెట్ల!

  •     అధ్వాన్నంగా మారిన రోడ్లు
  •     నానా తిప్పలు పడుతున్న వాహనదారులు

మెదక్​ జిల్లా నెట్​వర్క్​, వెలుగు :  జిల్లాలో గ్రామీణ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ఏండ్ల తరబడి రిపేర్లు చేయకపోవడంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు  పూర్తిగా డ్యామేజీ అయ్యాయి.  కంకర తేలి, గుంతలు పడి, వర్షానికి నీరు నిలిచి, బురదమయంగా తయారయ్యాయి. దీంతో వెహికల్స్​రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొని వాహనదారులు నానా తిప్పలు పడుతున్నారు.  ఏండ్లు గడుస్తున్నా రోడ్లు బాగు చేయకపోగా కనీసం రిపేర్లు కూడా చేపట్టక పోవడంపై ఆయా ప్రాంతాల ప్రజలు మండి పడుతున్నారు.

  •      అల్లాదుర్గం నుంచి రాయిపల్లి వెళ్లే రోడ్డు,  రేగోడు నుంచి రాయిపల్లి వెళ్లే రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్లు కనీస రిపేర్లకు  నోచుకోలేదు. దీనికి తోడు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరింత అధ్వానంగా తయారై రెండు మండలాల ప్రజలతోపాటు, ఈ రూట్​లో ప్రయాణించే ఇతర ప్రాంతాల వారు నరకం అనుభవిస్తున్నారు. ఈ రోడ్లపై ప్రయాణం చేసేందుకు వాహనదారులు జంకుతున్నారు. అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ డ్రైవర్లు సైతం ఈ రోడ్లపై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 
  •      శివ్వంపేట మండలంలో అనంతరం చౌరస్తా నుంచి చండి వరకు 10 కిలోమీటర్లు, ఉసిరికపల్లి చౌరస్తా నుంచి పోతుల బొగడ వరకు 8 కిలోమీటర్ల దూరం రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మరింత అధ్వాన్నంగా మారింది. కొన్ని చోట్ల భారీగా నీరు నిలిచి చిన్నపాటి కుంటను తలపిస్తోంది. రోడ్డు బురదమయంగా మారడంతో మండలంలోని అనేక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 18 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి రూ.37 కోట్లు మంజూరు కాగా కల్వర్టులు నిర్మించి, కొంతవరకు తవ్వి మట్టి పోశారు. రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ఎప్పట్లాగే ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.
  •      మండల కేంద్రమైన  నిజాంపేట నుంచి -నస్కల్ వెళ్లే రోడ్డును బాగు చేయాలని ఎన్నో ఏండ్ల నుంచి నస్కల్, రాంపూర్ గ్రామాల ప్రజల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పటికి ఈ రోడ్డు పనులకు మోక్షం కలగడం లేదు. మూడేళ్ల కింద నస్కల్, నందగోకుల్, చల్మెడ  రోడ్డు అభివృద్ధికి  రూ.12 కోట్లు  మంజూరు కాగా అప్పటి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆఫీసర్లు కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ చేసుకుని పనులు స్టార్ట్ చేసినప్పటికీ  అవి ఇంకా పూర్తి కాలేదు. కాంట్రాక్టర్​11 నెలల కింద నిజాంపేట నుంచి తెంబ గుట్ట వరకు కంకర పోసి వదిలేశారు. ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు.
  •      పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామ శివారులో వంతెన శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం రూ.2.35 కోట్లతో  కొత్త వంతెన నిర్మించింది. సంబంధిత కాంట్రాక్టర్ వంతెన నిర్మించి ఇరువైపులా అప్రోచ్​రోడ్డు పని చేయకుండా వదిలేశారు. దీంతో రెండు, మూడు సంవత్సరాల నుంచి మట్టి రోడ్డుపైనే వాహనాలు నడుస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి రోడ్డు కాస్తా గుంతలు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.  సుమారు 100 మీటర్ల  మట్టి రోడ్డుపై అధికక సంఖ్యలో  గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీగా ఉండే ఈ రోడ్డు మీద రోజు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అయినా అధికారులు పట్టించుకోవడంలేదు.