వాట్సాప్లో ​ఫేక్ డీపీ పెట్టి.. 1.79 లక్షల మోసం

బషీర్ బాగ్, వెలుగు: బంధువుగా నమ్మించి ఓ బిజినెస్ మ్యాన్​ను సైబర్ చీటర్స్ మోసగించారు. సిటీకి చెందిన 52 ఏండ్ల వ్యాపారవేత్తకు తొలుత ఫేస్​బుక్ మెసెంజర్​లో అతని బంధువు పేరిట ఎమర్జెన్సీగా రూ.5.70 లక్షలు అవసరం ఉన్నాయని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్​ను క్లిక్ చేయగా, అతని బంధువు ప్రొఫైల్​తో ఉన్న వాట్సాప్​కు రీ డైరెక్ట్ అయ్యింది. 

దీంతో మెసేజ్ చేసింది తన బంధువేనని అనుకున్న బాధితుడు.. తన దగ్గర అంత డబ్బులు లేవని, ఒక్కరోజు సమయం ఇవ్వాలని కోరాడు. కనీసం రూ.2 లక్షలైనా పంపించాలని ఒత్తిడి చేయగా, నమ్మిన బాధితుడు తన అకౌంట్​లో ఉన్న రూ. 1.79 లక్షలు బదిలీ చేశాడు. అనంతరం ఆ నంబర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, తన బంధువుకు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో బాధితుడు ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.