డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం 13 పైసలు పడిపోయి రూ.79.91కి చేరింది. ఇవాళ ఉదయం కరెన్సీ మార్కెట్ లో రూపీ ట్రేడింగ్ రూ.79.83 వద్ద ప్రారంభమై.. చివరకు రూ.79.91 వద్ద ముగిసింది. అంతకుముందు రోజు (మంగళవారం) రూపాయి మారకం విలువ రూ.79.78 వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఏ విధమైన నిర్ణయాలు వస్తాయోనన్న భయాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో రూపాయి విలువ పతనమైంది.
రూ.82కు పడిపోయే చాన్స్
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడీపీ అంచనాలను 8.2 శాతం నుంచి 7.4 శాతం తగ్గించింది. ఈ అంచనాలు కూడా రూపాయి పతనానికి దారితీస్తు్న్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే విదేశీ పెట్టుబడులు భారత మార్కెట్‌ను మరింతగా వీడి, రూపాయి విలువ రూ. 82కి పడిపోయే చాన్స్ ఉంటుంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ వాతావరణంలో మార్పు వచ్చి ముడిచమురు ధర తగ్గితే.. వచ్చే ఏడాది మార్చికల్లా రూపాయి బలోపేతమై రూ.78కి చేరొచ్చని అంచనా వేస్తున్నారు.
