- కార్డు పేమెంట్స్‌లో యూఎస్ కంపెనీలపై ఆధారపడడం తగ్గుతోంది
- రూపేను విదేశాల్లోనూ అంగీకరించేందుకు చర్యలు తీసుకుంటున్న ఎన్‌పీసీఐ
బిజినెస్ డెస్క్, వెలుగు: ‘ప్రతి ఒక్కరూ బోర్డర్‌లో ఉండి దేశానికి సేవ చేయలేరు. రూపే కార్డును వాడడం అలవాటు చేసుకుంటే ..అది కూడా దేశానికి సేవ చేసినట్టే’ 2018 లోని ఓ స్పీచ్‌లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలివి. వీసా, మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి యూఎస్ కంపెనీలపై విపరీతంగా ఆధారపడుతున్న టైమ్‌లో మనకంటూ ఒక కార్డు నెట్‌వర్క్ అవసరం అని ప్రభుత్వం గుర్తించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ యూఎస్ కంపెనీలు రష్యాను బాయ్‌కాట్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు పేమెంట్ సర్వీస్‌లలో అనేక ఇబ్బందులు పడుతుండడాన్ని చూడొచ్చు. దేశంలో వీసా, మాస్టర్‌కార్డ్ వంటి సంస్థలను రూపే అధిగమించగలదా? మనదేశంలో కూడా వీసా, మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్ క్లబ్ వంటి యూఎస్ కంపెనీల కార్డులపై విపరీతంగా ఆధారపడుతున్నాం. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల విషయంలో ఈ దేశంలో ఈ కార్డు పేమెంట్ కంపెనీల హవా నడుస్తోంది. కానీ, డెబిట్ కార్డుల విషయంలో రూపే బాగా విస్తరించింది. 2012 లో లాంచ్ అయిన రూపేకి, 2017 నాటికి మార్కెట్‌లో 15 శాతం వాటా ఉంది. 2020 చివరి నాటికి ఈ వాటా 63 శాతానికి పెరిగిందని అంచనా. ఇప్పటి వరకు 60 కోట్ల కార్డులను ఎన్‌పీసీఐ ఇష్యూ చేసింది. ప్రభుత్వ స్కీమ్‌ల కింద ప్రజలకు ఓపెన్ చేసే బ్యాంక్ అకౌంట్లతో రూపే కార్డులను ఇష్యూ చేయడం వంటివి రూపే విస్తరించడానికి కారణమయ్యాయి. ఎన్‌పీసీఐకి మేలు చేసేలా ఇండియా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉన్నాయని యూఎస్ గవర్న్‌మెంట్‌కు వీసా ఫిర్యాదు కూడా చేసింది. డెబిట్ కార్డు సెగ్మెంట్‌లో విస్తరించినా, క్రెడిట్ కార్డు సెగ్మెంట్‌లో రూపే ఇంకా వెనకబడే ఉందని చెప్పాలి. కార్డు పేమెంట్స్‌ను బాగా చేసే 1 లేదా 2 శాతం జనాభా తమ వీసా లేదా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి కార్డులకు బదులు రూపేకి షిఫ్ట్ అవ్వడానికి రెడీగా లేరు.
క్రెడిట్ కార్డు సెగ్మెంట్‌లో కష్టమే..
క్రెడిట్ కార్డు సెగ్మెంట్‌లో రూపే కార్డు విస్తరించడం అంత ఈజీ కాదని ఎనలిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే క్రెడిట్ కార్డులను వాడే వారు విదేశాల్లో, వివిధ ఈ–కామర్స్ వెబ్‌సైట్లలోనూ అంగీకరించే కార్డులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. రూపేని కూడా ఇంటర్నేషనల్‌గా అంగీకరించేలా చేయడానికి ఎన్‌పీసీఏ అనేక చర్యలు తీసుకుంటోంది. డిస్కవర్ ఫైనాన్షియల్‌తో టై అప్ అయ్యింది. ‘వారికి ఎన్‌పీసీఐ టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తున్నాం. మన అకౌంట్ నెంబర్ల ను వాడి కార్డులను ఇష్యూ చేస్తున్నారు. వారికి చిప్‌లను అందిస్తున్నాం. రిమోట్‌గా కామర్స్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. వారు మార్కెట్‌లో విస్తరిస్తున్నారు’ అని 20202 లో ఇన్వెస్టర్లకు ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో డిస్కవర్ సీఈఓ రోజర్ హోచిల్డ్ పేర్కొనడం గుర్తుండే ఉంటుంది. మరోవైపు జపాన్‌కు చెందిన జేసీబీ ఇంటర్నేషనల్‌తో కూడా ఎన్‌పీసీఐ పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది.
కార్డుల కంటే యూపీఐకే..
రూపేను విస్తరిస్తున్నప్పటికీ ఎన్‌పీసీఐ ఫోకస్ యూపీఐపై ఎక్కువగా ఉందని చెప్పాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్ల కంటే యూపీఐ ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. యూపీఐతో డిజిటల్ పేమెంట్స్ రూపురేఖలు మారిపోయాయి. పర్సన్ నుంచి పర్సన్‌కు జరిగే ట్రాన్సాక్షన్లు కలుపుకుంటే దేశంలో డిజిటల్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్లు ఐదు రెట్లు పెరిగాయి. యూపీఐని విదేశాల్లో కూడా లాంచ్ చేయాలని ఎన్‌పీసీఐ చూస్తోంది. దుబాయ్‌కు చెందిన మాష్రెక్‌బ్యాంక్ పీఎస్‌సీతో ఎన్‌పీసీఐ కిందటేడాది పార్టనర్‌షిప్ కుదుర్చుకున్నది. గల్ఫ్‌లోని ఇండియన్లు యూపీఐ వాడుకునేందుకు వీలుగా ఈ పార్టనర్‌షిప్‌ను కుదుర్చుకున్నారు. వివిధ దేశాల్లో వాడే డిజిటల్ పేమెంట్స్‌ను సిస్టమ్‌ను కలిపే నెక్సస్ నెట్‌వర్క్‌ను కూడా ఇండియా వాడుకునే వీలుంది.
