న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ మీద వచ్చే పుకార్లను నమ్మొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ అన్నారు. వ్యాక్సిన్ సేఫ్టీ మీద రకరకాల రూమర్లు, అపోహలు వచ్చే అవకాశం ఉందని.. వాటితో జాగ్రత్తగా ఉండాలన్నారు. దేశంలో వాడబోయే వ్యాక్సిన్ చాలా సురక్షితమైందని, అన్ని విధాలుగా పరీక్షించాకే అనుమతించామని స్పష్టం చేశారు.
‘వ్యాక్సిన్ సేఫ్టీపై ఎలాంటి రూమర్లకు తావు లేదు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా, కూలంకుషంగా పరిశీలించాకే అనుమతించాం. దేశంలో పోలియో చుక్కలు వేసిన తొలినాళ్లలో చాలా అపోహలు వ్యాప్తిలోకి వచ్చాయి. కానీ ఒక్కసారి పిల్లలకు చుక్కులు వేయడం మొదలయ్యాక సురక్షితమని ప్రజలు నమ్మారు. వ్యాక్సిన్ డ్రై రన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అసలైన వ్యాక్సిన్ ఇవ్వడమొక్కటే మిగిలింది’ అని హర్ష వర్దన్ చెప్పారు.
