ప్రచారం: కుల గణన వల్ల హిందూ మతానికి ప్రమాదం.. కానీ వాస్తవం ఇది..

జనగణనలో  కులగణన అనే విషయం నేడు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది. మెజార్టీ  రాజకీయ పార్టీలు  కులగణన జరగాలని కోరుకుంటున్నాయి..ఈ దేశ పాలనలో మెజారిటీ ప్రజల భాగస్వామ్యం లేనిదే ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోదు. కాని కొందరు కులగణన వ్యతిరేకులు అనేక కుట్రలు , కుతంత్రాలు పన్ని కులగణన కు వ్యతిరేకముగా అనేక దుష్ప్రచారాలు కొనసాగిస్తూ కుల గణనకు అడ్డు పడాలని చూస్తున్నారు. ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్కను పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి,అప్పుడు అందరు సహకరిస్తారు, తలా ఒక రాయి విసురుతారు.ఈ సామెతను నమ్మి కొందరు ఒక క్రమ పద్దతి ప్రకారం దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దుష్ప్రచారాలను ఖండిస్తు బీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరమ్ సవివరం గా , సహేతుకంగా, శాస్త్రీయం గా వివరణలు ఈ క్రింది విధంగా ఇవ్వడమైనది.

1 ప్రచారం: కులగణన కష్టమైనది, పరి పాలన దృష్ట్యా సాధ్యము కాదు
వాస్తవం: కుల గణన కష్టమైనది కాదు, క్లిష్టమైనది అంతకంటే ఏమీ కాదు. ఎలాంటి సమాచార సాంకేతిక పరిజ్ఞానం,కమ్యూనికేషన్స్, రవాణా సౌకర్యములు లేని కాలంలో నిరుపేద, నిరక్షర, బానిస భారతదేశంలో బ్రిటిష్ వారు, మన రాష్ట్రంలో నిజాం వారు, 1881 నుంచి 1931 వరకు అన్ని కులాల గణన ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి నిర్వ హించే జనాభా లెక్కలలో సేకరించారు. ఇంత సాంకేతికముగా, కృత్రిమ మేధ అభివృద్ధి చెందిన ఈ కాలంలో కష్టమైనదా? కావున ఈ వాదన సరైనది కాదు. ఇప్పటికే సెన్సస్ లో ఎస్సీ, ఎస్టీల కులం వివరాలు సేకరిస్తున్నారు అందులో ఓబీసీ కేటగిరీ కాలమ్ చేర్చితే సరిపోతుంది. 

2 ప్రచారం :-  హిందూ సమాజాన్ని విభజిస్తుంది, కులతత్వం పెంచుతుంది. 

వాస్తవం: హిందూ సమాజమును విభజిస్తుంది అనేది వాస్తవం కాదు. భారతీయ సమాజం ముఖ్యంగా హిందూ సమాజం, గత మూడు వేల సంవత్సరాలుగా కులాల పేరుతో, వర్ణాల పేరుతో విభజించబడి ఉన్నది. కొత్తగా విభజింపబడేది ఏమీ లేదు. ఈ వర్ణములు, కులాలు అగ్రవర్ణాల తమ సౌలభ్యం, ఆధిపత్యం కొరకు సృష్టించినవే. శూద్రులను, అతిశూద్రులను అణచివేయడానికి ఏర్పాటుచేయబడినవే, కావున ఈ వాదనలో పస లేదు. ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని కోరుకొనే వారే ఇలాంటి వాదనలను తెరపైకి తెస్తారు. ఇక పోతే కులతత్వం పెరగటానికి కారకులు అగ్రవర్ణాలు, అందులోని రాజకీయ నాయకులు కాదా? తమ స్వార్థం కోసం, ఆధిపత్యం కోసం కుల సంఘాలను ప్రోత్సహించి కుల తత్త్వాన్ని  పెంచి పోషించడము లేదా? ఇక కొత్తగా పెరిగేది ఏమిటి?

ప్రచారం: ఓబీసీల కులగణనను ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి, ఓబీసీలు ఒక రాష్ట్రంలో బీసీలు, మరొక రాష్ట్రంలో ఎస్సీలు లేదా ఎస్టీలు కావున ఈ సంక్లిష్టతపై అధ్యయనం చేయాలి.

3 వాస్తవం :  జనగణన (సెన్సస్​)లో 1234 ఎస్.సి. మరియు 698 ఎస్.టి. కులాల లెక్కలు సేకరిస్తారు. మన రాష్ట్రంలో లంబాడాలు ఎస్టీలు, పక్కన మహారాష్ట్రలో ఓబీసీలు. మన రాష్ట్రంలో రజకులు ఓబీసీ, బీహార్ లో ఎస్సీలు. మహేంద్ర (మేదరి , కులం )తెలంగాణలో బీసీలు, పక్కన కర్ణాటకలో ఎస్.టి.లు. ( మేద,మేదరి, బురుడు ) మహారాష్ట్రలో ఎస్సీలు (బురుడు) అలాంటప్పుడు ఎస్ సీ, ఎస్.టి ల లెక్కలు సేకరించడం లేదా ? కులం అనేది ఒక్కొక్క ప్రాంతంలో అక్కడి సామాజిక అంతస్తు, విద్యాపరమైన వెనుకబాటు తనాన్ని బట్టి ఒక్కొక్క విధంగా రిజర్వేషన్ కేటగిరీ కింద వర్గీకరించబడి ఉంది . కేవలం ఓబీసీల లెక్కలు సేకరించమంటే ఈ అసంబద్ద వాదనలేల?

4 ప్రచారం :  ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి. వాటిని కూడా లెక్కించాలా? 
వాస్తవం :  ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇలా ఏ మతంలోనైనా కులాలు ఉంటే వాటిని కూడా లెక్కించాలి. ఇప్పటికే చాలా ముస్లిం కులాలు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఓబీసీలలో ఉన్నారు. ఉదాహరణకు మన రాష్ట్రంలో బీసీ– ఎ లో మెహతర్, బసీ– బిలో దూదేకుల, లద్దాపి, పింజారి లేదా నూర్ భాషా, బీసీ–ఈ లో 14 ముస్లిం కులాలు ఉన్నాయి. అలాగే ఎస్ సీ ల నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారికి బీసీ–సి' క్యాటగిరీ ఉంది కావున ఏ మతంలో కులాలు ఉన్నా గణన చేయాల్సిందే.

5 ప్రచారం : కులగణన వలన రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతుంది
వాస్తవం : ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్  టీలకు వారి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రకులాలు 15% ఉండగా అందులో 5% లేని అగ్రకుల పేదలకు ఇడబ్ల్యూఎస్ పేరిట 10% విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ దేశ మూల వాసులైన ఓబీసీలు 60% ఉంటే వారికి 27% కేవలం విద్య, ఉద్యోగాలలో ఇచ్చారు. అది కూడా ఇప్పటివరకు పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. 
చట్టసభలలో ఎలాంటి రిజర్వేషన్లు లేవు. స్థానిక సంస్థలలో 50% సీలింగ్ కు లోబడి ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చాక  మిగిలితే బీసీలకు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా 15% జనాభాలేని అగ్రవర్ణాలు కేంద్రంలోని విద్య, ఉద్యోగాలలో 50% పైబడి, చట్టసభలలో 60% పైబడి ఉంటారు. 60%నికి పైబడి జనాభా ఉన్న ఓబీసీలు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగంలో 22% నకు లోపే పరిమితమై ఉంటారు. అలాగే ఈనాటికీ కేంద్ర ప్రభుత్వంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో చేరని వందల ఓబీసీ కులాలు ఉన్నాయి. 

6 ప్రచారం: రిజర్వేషన్ల వలన మెరిట్ కు అన్యాయం.
వాస్తవం: మెరిట్ అనేది సాపేక్షిక అంశం. అనాదిగా అగ్రవర్ణాలు వర్ణ వ్యవస్థలో రిజర్వేషన్లు అనుభవించలేదా? బ్రాహ్మణులు పౌరోహిత్యం, వేద, పురాణాలు పఠించడం, గురువుల పాత్ర పోషించ లేదా! క్షత్రియులు రాజరికం, వైశ్యులు వ్యాపారం చేయగా, శూద్రులను కేవలం వారికి సేవలు చేసే బానిస వర్గాలుగా మార్చలేదా? విద్యలు నేర్చిన శూద్రులకు ఎలాంటి గతి పట్టించారో తెలియచేయటానికి పురాణాలలో ని ఏకలవ్యుడు, శంభూకుని కథలు మనకు కనిపించవా! 

భారతదేశంలో గత 77 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు అమలు కాబడుతున్నాయి. మరి మన దేశం అభివృద్ధి పథంలో పయనించడం లేదా? రిజర్వేషన్లు శాస్త్ర , న్యాయ , ఉన్నత వైద్య, టీచింగ్ రంగాలలో ఎక్కడున్నవి? ప్రైవేటు రంగంలో ఎక్కడ ఉన్నవి. కేవలం కొన్ని విద్య, ప్రభుత్వ ఉద్యోగ ,రాజకీయ రంగాలలో కల్పిస్తేనే ప్రతిభ (మెరిట్) దెబ్బతింటుందా.? మరి  EWS మెరిట్ ఏమిటి? బీసీల కంటే తక్కువ లేదా? తమిళనాడులో విద్య ఉద్యోగాలలో ఒ.బి.సి లకు 50 % రిజర్వేషన్లు ఉన్నాయి. మరి అక్కడ ప్రభుత్వ కార్య నిర్వాహక వ్యవస్థ కుప్పకూలిందా? ఎవరి జనాభా ప్రకారం వారికి వాటా పంచాల్సిందే.

రాజ్యాంగము లోని ఆర్టికల్ 15(4),16(4) ల లో 50% రిజర్వేషన్ దాటకూడదనే నిబంధన ఎక్కడాలేదు . ఇది కేవలం సుప్రీంకోర్టు విధించిన ఈ 50శాతం సీలింగ్ ను రాజ్యాంగ సవరణ చేసి తొలగించాల్సిందే. ఈ దేశంలో కుల వ్యవస్థ రూపుమాపాలంటే, హిందువులందరూ ఏకం కావాలంటే , అనాదిగా అణగ దొక్కబడిన ఓబీసీ (శూద్ర) వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి వారిని ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందేలాగ అవకాశాలు కల్పించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కులరహిత సమాజం ఏర్పాటు సుగమవుతుంది. రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం అందరికీ అందుతుంది. రాజ్యాంగ నిర్మాతల కలలు నెరవేరుతాయి.

7 ప్రచారం: హిందూ మతానికి ప్రమాదం
వాస్తవం: చరిత్రలో కులవివక్షతలు లేని కాలంలో ప్రజలు ఐకమత్యంగా ఉన్నారు. ఈ దేశం క్షేమంగా ఉంది. ఎప్పుడైతే కుల వ్యవస్థ విజృంభించిందో అప్పుడే ఈ దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లి పోయింది. 660 సంవత్సరాల కాలం మహమ్మదీయుల పరిపాలనలో,190 సంవత్సరాల ఇంగ్లీష్ వారి పరిపాలనలో మగ్గింది. ఇన్ని సంవత్సరాలు నిరంకుశ, రాచరిక, విదేశీ మతాల పాలనలో మగ్గినా, ఎన్ని హింసలు, అత్యాచారాలకు గురైనా హిందూమతాన్ని ఎవరూ ఏమీ చేయలేక పోయారు. కొందరు గతంలో  మతంలోని తీవ్ర వివక్షత వలన లేదా పరాయి పాలకుల అరాచకాల వలన మతం మారి ఈ దేశ విభజనకు కారణం అయి ఉండవచ్చును . 
 

కానీ నేటి ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఈ మెజారిటీ ప్రజల పాలనలో హిందూమతానికి  విదేశీ మతాల నుంచి తీవ్ర ముప్పు ఉన్నది అన్న వాదన కూడా సరైనది కాదు. క్రింది వర్గాల హిందువులకు తగు అవకాశాలు కల్పించకుండా అణగదొక్కడానికి, ఓబీసీలను ఓట్ బ్యాంకు గా మలుచుకొని తమ ఆధిపత్య కులాల పాలనను కొనసాగించటానికి అగ్రవర్ణాలు , ఫ్యూడల్ పాలకులె చేసే కుట్ర. ఇది మరి దుష్ప్రచారం. మొదలు ఓబీసీ లకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తే వారు కూడా మీతో సమ ఉజ్జీలుగా కలసివస్తారు. అప్పుడు ముప్పు ఉంటే అందరు సమైక్యంగా ఎదుర్కోవచ్చును.

8 ప్రచారం:  కులం అనేది విదేశీయుల కుట్ర. కులం అనేది భారతదేశంలో విదేశీయులు ప్రవేశపెట్టిన భావన 
వాస్తవం:  ఇది కూడా శుద్ధ అబద్ధం. ఋగ్వేద కాలం నుండి ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉంది. ఋగ్వేదంలోని పురుష సూక్తంలో ప్రజాపతి శిరస్సు నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించినట్లు శ్లోకం లేదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాతుర్వర్ణం మయ స్పషము గుణకర్మ విభాగశ: అనలేదా ? మనుస్మ్రతిలో శూద్రులను ఏవిధంగా అణగ త్రొక్క వలెనో వివరించబడలేదా..?

9 ప్రచారం: కుల గణన డిమాండు విదేశీ శక్తుల కుట్ర
వాస్తవం: భారతదేశం ప్రగతిని చూసి ఓర్వలేక విదేశీ శక్తులు ఈ దేశ సంస్కృతిని, సమైక్యతను, సమగ్రతను దెబ్బతీయడానికి పన్నిన పన్నాగం అనేది ఒక శుద్ధ అబద్ధం. ఒక దుష్ప్రచారం. ఇదే నిజమైతే బీజేపీ 2010 పార్లమెంటులో 2011 సెన్సెస్ లో కులగణన చేయాలని డిమాండ్ చేసి పార్లమెంటులో తీర్మానం ఆమోదానికి అనుకూలంగా ఓటు వేయలేదా? ఆగస్టు 31, 2018 న పార్లమెంటులో ఆనాటి హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 2021 సెన్సెస్ లో కులగణన చేస్తామని ప్రకటిచలేదా? వారు విదేశీ శక్తుల ప్రభావానికి లోనై ఈ ప్రకటన చేశారా? ఇది కేవలం కులగణన చేయకుండా ఎగ్గొట్టడానికి చేస్తున్న దుష్ప్రచారం.  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుకున్నదే తడవుగా ఏకీకృత పన్ను వ్యవస్థ (G.S.T.)
పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, అడగకుండానే అగ్రవర్ణాలకు 10% E.W.S. రిజర్వేషన్లు, మహిళలకు 33% రిజర్వేషన్లు , జమిలి ఎన్నికల బిల్లు తీసుకురావడం లేదా కానీ వారికి కులగణన చేయడానికి మనస్సు లేక రకరకాల సాకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. కులగణన వలన దేశానికి నష్టం ఏమీ లేదు. అగ్రవర్ణాల ఆధిపత్యానికి తెరపడటం తప్ప .60 శాతం జనాభా ఉన్న ఓబీసీ ప్రజలు ఈ దేశ పాలన వ్యవస్థలో భాగస్వామ్యం లేకుండా ఈదేశం ఎలా ప్రజాస్వామ్య దేశం అవుతుంది ? రాజ్యాంగ ఆశయాలు ఎలా నెరవేరుతాయి ? అందుకే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జనులు ఏకమై సమగ్ర కులగణనకు నినదించాలి.

- టి.చిరంజీవులు, ఐఏఎస్​ (రి) కన్వీనర్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్