NHRC చైర్​పర్సన్ నియామకంలో నిబంధనలు పాటించలే: ఖర్గే

న్యూఢిల్లీ: నేషనల్​హ్యూమన్​రైట్స్ కమిషన్​(ఎన్ హెచ్ఆర్​సీ) చైర్​పర్సన్ నియామకంలో కేంద్రం నిబంధనలు పాటించలేదని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్‎హెచ్ఆర్​సీ చైర్​పర్సన్‎గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్​వీ రామసుబ్రహ్మణియన్​నియామకం లోపభూయిష్టమని ఆరోపించింది. ఈమేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఉమ్మడిగా ఓ అసమ్మతి ప్రకటనను విడుదల చేశారు. 

చైర్మన్ ఎంపిక ఏకపక్షంగా సాగిందని అందులో పేర్కొన్నారు. కాగా, ఎన్​హెచ్​ఆర్​సీ చైర్​పర్సన్​గా సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు జస్టిస్​రోహింటన్ ఫాలి నారిమన్, జస్టిస్​కేఎం జోసెఫ్ పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించింది. అయితే, జస్టిస్​వీ రామసుబ్రహ్మణియన్‎ను కేంద్రం నియమిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. కమిషన్ సభ్యులుగా ప్రియాంక్​ కనూంగో, డాక్టర్​జస్టిస్​బిద్యుత్​రంజన్‎ను నియమించింది. దీనిపై కాంగ్రెస్​అసంతృప్తి వ్యక్తంచేసింది.

పరస్పర సంప్రదింపులు లేకుండానే..

ఎన్‎హెచ్ఆర్‎సీ చైర్మన్ ఎంపికపై సమావేశంలో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే కేంద్రం చైర్​పర్సన్​ను నియమించిందని కాంగ్రెస్ నేతలు అసమ్మతి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తరహా అంశాల్లో ప్రతిపక్షాలతో చర్చించడం, ఏకాభిప్రాయ సాధనలాంటి సాంప్రదాయాన్ని కేంద్రం విస్మరించిందని తెలిపారు. సమావేశంలో లేవనెత్తిన చట్టబద్ధమైన ఆందోళనలను పక్కనపెట్టారని, కేవలం సంఖ్యాపరమైన మెజార్టీ ఆధారంగానే  ఈ నియామకాన్ని చేపట్టారని పేర్కొన్నారు.