కోల్‌కతా: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాన్వాయ్ పై బెంగాల్‌లో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర బలగాలు పహారాగా ఉండి కూడా దాడిని అడ్డుకోలేకపోయాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర పోలీసు అధికారులకు కేంద్రం సమన్లు కూడా జారీ చేసింది. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా స్పందించారు.
సెంట్రల్ డిప్యుటేషన్ కింద తమకు భద్రత కల్పించమని స్టేట్ పోలీస్ ఆఫీసర్లకు సమన్లు పంపించే అధికారం కేంద్రానికి ఉందని షా స్పష్టం చేశారు. సిటిజన్‌షిప్ అమెండెమెంట్ యాక్ట్ (సీఏఏ) పైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సీఏఏను అమలు చేయాల్సి ఉంది. అలాంటి భారీ ప్రక్రియను కరోనా వైరస్ కారణంగా అమలు చేయలేకపోయాం. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరగా మొదలై, వైరస్ సమస్య వీడితే అప్పుడు సీఏఏ అమలు గురించి ఆలోచిస్తాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.
